China: కరోనా ఉద్ధృతిపై అవన్నీ తప్పుడు నివేదికలే: చైనా

చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కానీ, దీనిపై ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికలను ఆ దేశం ఖండించింది. 

Published : 29 Dec 2022 11:00 IST

బీజింగ్‌: కరోనా వైరస్ కొత్త వేరియంట్లతో చైనా విలవిల్లాడుతోంది. కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడిందని, శ్మశాన వాటికలు రగులుతూనే ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది.

‘ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం. దశలవారీగా వైరస్ విజృంభిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోంది’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. 

కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ స్థాయిని క్లాస్ ‘ఎ’ ఇన్‌ఫెక్షన్ల నుంచి క్లాస్ ‘బి’ కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్  ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. చైనాలో 40 రకాల ఇన్ఫెక్షన్లను ఎ,బి,సి కేటగిరిల్లో వర్గీకరించారు. ‘ఎ’ కేటగిరిలో కలరా, ప్లేగు వంటివి ఉన్నాయి. మరోపక్క అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

చైనా ఉద్ధృతిని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే భారత్‌, ఇటలీ, జపాన్‌, తైవాన్‌ వంటి దేశాలుండగా.. తాజాగా అమెరికా కూడా చేరింది. తమ దేశానికి వచ్చే చైనీయులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. దీని ప్రకారం విమానం ఎక్కడానికి 48 గంటల ముందు వచ్చిన నెగెటివ్ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంది. జనవరి 5 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. చైనాతో పాటు హాంకాంగ్‌, మకావు నుంచి వచ్చే వారికి కూడా ఇది వర్తిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని