China: డ్రాగన్‌ కాఠిన్యం.. జంతువుల్లా బోనుల్లో ప్రజల క్వారంటైన్‌..!

ఈ చిత్రంలో వరుసగా కన్పిస్తున్న మెటల్‌ బాక్స్‌లు.. కొవిడ్‌ అనుమానితుల కోసం చైనా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ క్యాంప్‌ గదులు..! కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు

Updated : 14 Jan 2022 02:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ చిత్రంలో వరుసగా కన్పిస్తున్న మెటల్‌ బాక్స్‌లు.. కొవిడ్‌ అనుమానితుల కోసం చైనా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ క్యాంప్‌ గదులు..! కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అనుసరిస్తోంది డ్రాగన్‌ సర్కారు. ఈ క్రమంలో రోగులు, అనుమానితుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఆంక్షల పేరుతో వారిని జంతువుల మాదిరిగా బలవంతంగా నిర్బంధిస్తోంది. అక్కడ ఒక్క కేసు వచ్చినా ఊరంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అది కూడా ఇళ్లల్లో కాదు.. అధికారులు ఏర్పాటు చేసిన ఇలాంటి క్వారంటైన్ శిబిరాల్లో..! 

చైనాలోని అతిపెద్ద నగరాలైన షియాన్‌, టియాంజిన్‌, అన్యాంగ్‌ ప్రాంతాల్లో మళ్లీ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఆయా నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎంతలా అంటే.. ఒక ప్రాంతంలో ఒక్క వ్యక్తికి పాజిటివ్‌గా తేలినా.. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ బలవంతంగా క్వారంటైన్‌ శిబిరాలను తరలిస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా రెండు వారాల పాటు ఈ బాక్సుల్లాంటి గదుల్లో ఉండాల్సిందే. వీటిలో ఒక బెడ్‌తో పాటు మరుగుదొడ్డి ఉంటుంది. ఈ గదులకు చిన్న కిటికీలు ఉంటాయి. అందులో నుంచి కేవలం తల మాత్రమే బయటకు పెట్టి రోజువారీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక చిన్నారులు కూడా పెద్దల సమక్షంలో కాకుండా ఒంటరిగా గదుల్లో ఉండాల్సిందేనట.

చైనాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలను క్వారంటైన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం వందల బస్సులను ఏర్పాటు చేశారు. ప్రజలను తరలించేందుకు క్యూలైన్లలో ఉన్న బస్సులు, చిన్నారులకు పీపీఈ కిట్లు వేసిన తరలిస్తున్న వీడియోలను ఇటీవల కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతోన్న వేళ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా కఠిన ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు క్వారంటైన్‌లో ఉన్నారు. కొన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు కొనుక్కునేందుకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆంక్షల వల్ల వైద్య చికిత్స అందక ఇటీవల ఓ గర్భిణీ శిశువును కోల్పోవాల్సి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని