Nikki Haley: చైనాతో జాగ్రత్త.. అది అత్యంత క్రమశిక్షణ కలిగిన శత్రువు..!

అమెరికా(America) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీహేలీ.. చైనా గురించి హెచ్చరికలు చేశారు. అలాగే కొవిడ్ సహా పలు అంశాల్లో ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలన్నారు. 

Published : 04 Mar 2023 16:48 IST

బీజింగ్: అమెరికా(America) ఇప్పటివరకు ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే.. చైనా(China) అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువు అని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ(Nikki Haley) వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు. 

‘అమెరికా ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే.. చైనా(China) అత్యంత క్రమశిక్షణ కలిగిన శత్రువు. అలాగే బలమైనది. మనం చైనాను జవాబుదారీ చేయాలి. అది కొవిడ్ నుంచే ప్రారంభం కావాలి. అలాగే మన సరిహద్దులకు ఫెన్టానిల్(తీవ్ర నొప్పి నివారణకు వాడే డ్రగ్‌)ను పంపుతోన్న ఆ దేశాన్ని ఎదుర్కోవాలి’ అని హేలీ(Nikki Haley) అన్నారు. అలాగే ఇటీవలి చైనా నిఘా బెలూన్ ఘటనపైనా స్పందించారు. ‘అమెరికా గగనతలంలో ఓ చైనా నిఘా బెలూన్(spy balloon) వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఇది మనకెంతో అవమానం’ అంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘చైనా విషయంలో బైడెన్‌ వ్యవహరిస్తోన్న తీరును నేను నమ్మలేకపోతున్నా. మన దేశంలో చైనా సంస్థలు 3,80,000 ఎకరాల భూమిని సొంతం  చేసుకున్నాయి. అందులో కొన్ని మన మిలిటరీ బేస్‌లకు దగ్గరగా ఉన్నాయి. ఒక శత్రుదేశం మనదగ్గర భూమిని కొనేందుకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించకూడదు’ అని అన్నారు. అమెరికా పని అయిపోయిందని చైనా భావిస్తోందని, ఆ విషయంలో డ్రాగన్ పొరబడుతుందని చెప్పారు. తన దేశాన్ని మరలా సగర్వంగా తీర్చిదిద్దేందుకే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు ఆమె వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని