China: తైవాన్‌పై అవసరమైతే బలప్రయోగం తప్పదు..!

తైవాన్‌లో వేర్పాటు వాదాన్ని అస్సలు సహించమని బుధవారం చైనా పునరుద్ఘాటించింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.

Published : 11 Aug 2022 01:36 IST

వేర్పాటువాదాన్ని అస్సలు సహించమన్న చైనా

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌లో వేర్పాటు వాదాన్ని అస్సలు సహించమని బుధవారం చైనా పునరుద్ఘాటించింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. నాన్సీ పెలోసీ పర్యటన అనంతరం తైవాన్‌ చుట్టుపక్కల భారీ ఎత్తున చైనా యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. చైనాకు చెందిన తైవాన్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఆర్థిక తాయిలాలు, సైనిక బలం సాయంతో తైవాన్‌ను ఏ విధంగా వశం చేసుకుంటామో.. దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. 

‘‘ప్రశాంతంగా విలీనం కావడానికి అవసరమైన అవకాశాలను కల్పిస్తాం. అదే సమయంలో ఏ విధమైన వేర్పాటు వాదానికి చోటు లేదు. బలప్రయోగ అవకాశాలనూ తోసిపుచ్చడంలేదు. విలీనానికి అవసరమైన ఏ చర్య తీసుకోవడానికైనా అప్షన్‌ను సిద్ధంగా పెట్టుకొన్నాం. వేర్పాటువాదులు, బాహ్య శక్తులు లక్ష్మణ రేఖను దాటడమే.. మేము కఠిన చర్యలు తీసుకొనేలా పురిగొల్పుతాయి’’ అని ఈ శ్వేత పత్రంలో పేర్కొన్నారు. చైనా చివరిసారిగా 2000 సంవత్సరంలో శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారీ సైనిక విన్యాసాల మధ్య మరోసారి ఈ పత్రాన్ని విడుదల చేయడం గమనార్హం.

1990 తర్వాత తైవాన్‌లో నియంతృత్వం పోయి.. ప్రజాస్వామ్యం వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2016లో త్సాయి యింగ్‌ వెన్‌ అధికారంలోకి వచ్చాక చైనాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. త్సాయి నేతృత్వంలోని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసీవ్‌ పార్టీ తైవాన్‌ను చైనాలో భాగంగా పరిగణించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని