Imran Khan: ఇక పాక్‌ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan), ఆయన పార్టీ నేతలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మీడియాలో ఆయన ప్రస్తావన లేకుండా చేయాలని తాజా ఆదేశాలు ఇచ్చింది. 

Published : 06 Jun 2023 13:55 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్(Pakistan) ప్రభుత్వం పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)ను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. ఆయన పార్టీపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి ఆయన అన్ని ప్రధాన మీడియా సంస్థల ప్రసారాల్లో  కనిపించరు. ఆయన పేరు వినిపించదు. మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆగ్రహించిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది.

దీనికి సంబంధించి పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(PEMRA).. అక్కడి మీడియా సంస్థల(Pakistani Media)కు ఆదేశాలు ఇచ్చింది. ‘విద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు, అల్లరిమూకలు, వారికి సహకరించేవారిని మీడియా నుంచి పూర్తిగా నిర్మూలించండి’అని తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఎక్కడా ఇమ్రాన్ ఖాన్‌ పేరును మాత్రం ప్రస్తావించలేదు. కానీ ఆయన పేరు, చిత్రాలు, చివరకు ఆయన ప్రస్తావన కూడా మీడియా సంస్థల్లో కనిపించదు, వినిపిచందని తెలుస్తోంది. అయితే దీనిపై నియంత్రణ సంస్థ(PEMRA) నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

తనను, తన పార్టీని అణచివేసేందుకు అధికార పక్షం మే 9 అల్లర్లను ఒక సాకుగా చూపుతోందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. దానిని చూపించి పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నారని ఆరోపించారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్యకర్తలతో నిత్యం మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖాన్‌కు అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థ కూడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని తెలుస్తోంది.

తాజాగా సర్వేల ప్రకారం.. పాక్‌లో ఇమ్రాన్‌ అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలిచారు. ఇక ఆయన తన ప్రసంగాలు, సభలతో నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఆయనకు సంబంధించిన కంటెంట్‌కు వ్యూయర్‌షిప్ కూడా అధికంగానే ఉంటుందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని