North Korea: ఉత్తర కొరియా ఉద్ధృతితో కొత్త వేరియంట్లు పుట్టుకురావొచ్చు..!

ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆ దేశ వాసులు లక్షల్లో మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.

Published : 19 May 2022 02:32 IST

ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఆ దేశ వాసులు లక్షల్లో మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఉద్ధృతి కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చేందుకు దోహదం చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఉత్తర కొరియాలో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ.. ‘కరోనా కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు వాడకపోతే.. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే. ఎటువంటి నియంత్రణ లేకుండా వైరస్ వ్యాప్తి చెందితే.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెప్తోంది’ అంటూ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్ మైక్‌ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే టీకాలు వేయని, అరకొర వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆ దేశంలోని కొవిడ్ పరిస్థితులపై ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ హెచ్చరికలు చేశారు. అక్కడ వ్యాప్తిని అరికట్టేందుకు ఔషధాలు, టీకాలు, పరీక్షా సాధానాలు, సాంకేతిక సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

వారి పరిస్థితి మరింత దిగజారుతుంది: యూఎన్‌

ఇప్పటికే కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడుతోన్న ఉత్తర కొరియా ప్రజలకు తాజా కొవిడ్ ఆంక్షలు భయంకరంగా మారనున్నాయని ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వివక్ష లేకుండా, సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు కట్టుబడి ఉండేలా వాటిని అమలు చేయాలని కోరింది.

ఇక బుధవారం 2.32 లక్షల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఆరు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.7 మిలియన్లకు చేరగా.. మరణాలు 62కు పెరిగాయి. తాము కొద్దిసంఖ్యలోనే ఒమిక్రాన్‌ కేసుల్ని గుర్తించగలిగామని ఉత్తర కొరియా అధికారులు చెప్తుండగా.. ఈ జ్వరం కేసులన్నీ కొవిడ్ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉద్ధృతికి అధికారుల అపరిపక్వత, ఆలస్యంగా స్పందించడమే కారణమని అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ మండిపడ్డారు. రెట్టింపు వేగంతో పనిచేయాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని