Donald Trump: ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లోకి డొనాల్డ్‌ ట్రంప్‌ రీ ఎంట్రీ!

Donald trump back to Youtube and Facebook: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఆయా సోషల్‌ మీడియా ఖాతాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 18 Mar 2023 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌ (Facebook), యూట్యూబ్‌లోకి (Youtube) రీ ఎంట్రీ ఇచ్చారు.  2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్‌ ప్రముఖ సోషల్‌ మీడియాల్లోకి పునరాగమనం చేయడం ప్రాధాన్యం సతరించుకుంది. అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి అనంతరం ఆయన సోషల్‌ మీడియా ఖాతాలపై విధించిన నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వేదికలపై శుక్రవారం అభిమానులను పలకరించారు. 

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌నకు ఫేస్‌బుక్‌లో దాదాపు 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో సైతం 2.6 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. క్యాపిటల్‌ భవనంపై ఆయన అనుచరుల దాడి అనంతరం 2021లో ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలపై నిషేధం విధించారు. ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వెళ్లిన వెంటనే ఆయన ఖాతాపై ఉన్న నిషేదాన్ని గతేడాది నవంబర్‌లోనే ఎత్తివేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలలపై ఈ ఏడాది జనవరిలో నిషేధం తొలగించగా.. యూట్యూబ్‌ ఖాతా మాత్రం శుక్రవారమే అందుబాటులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే ‘ఐయామ్‌ బ్యాక్‌’ అంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్‌ దర్శనమిచ్చారు. 2016 ఎన్నికల విజయోత్సవ సభ ప్రసంగాన్ని అందులో ఉంచారు. ‘ఇన్నాళ్లు మిమ్మల్ని వేచి ఉంచినందుకు క్షమించండి’ అంటూ ఓ కామెంట్‌ను జత చేశారు. సోషల్‌ మీడియాలోకి రీఎంట్రీ వెనుక 2024 ఎన్నికలే లక్ష్యమని అందులో చెప్పకనే చెప్పారు. మరోవైపు నెలల క్రితమే ట్విటర్‌ ఖాతా అందుబాటులోకి వచ్చినప్పటికీ  ట్రంప్‌ ఇప్పటి వరకు అందులో ఒక్క ట్వీట్‌ కూడా చేయకపోవడం గమనార్హం. ట్విటర్‌లో ఆయనకు 87 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఒక్క ట్వీటూ చేయలేదని తెలుస్తోంది. ట్విటర్‌కు పోటీగా ఇప్పటికే ఆయన ‘ట్రూత్‌ సోషల్‌’ పేరిట సొంతంగా ఓ ప్లాట్‌ఫాంను నెలకొల్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని