Earthquake: శ్రీలంకలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దాని తీవ్రత 6.2గా నమోదైంది.

Updated : 14 Nov 2023 15:04 IST

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులంతా భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. భూ ప్రకంపనల తీవ్రతకు కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కి.మీ దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. అయితే, ఆస్తి, ప్రాణనష్టం గురించి వివరాలేమీ బయటకి రాలేదు. అయితే, తాజా భూకంపంవల్ల శ్రీలంకకు పెద్దగా నష్టం లేదని అమెరికా జియోలాజికల్‌ సర్వే అండ్‌ మైన్స్‌ బ్యూరో (జీఎస్‌ఎంబీ) పేర్కొంది.

లద్దాఖ్‌లో 4.4 తీవ్రతతో...

మరోవైపు భారత్‌లోని లద్దాఖ్‌లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. మధ్యాహ్నం 1.08 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కార్గిల్‌కు వాయువ్య దిశలో 314 కిలోమీటర్ల దూరం, 20 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సోమవారం సాయంత్రం తజకిస్థాన్‌లోనూ భూమి కంపించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5.46 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని