world Bank: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఇండో అమెరికన్‌ అజయ్‌ బంగా?

ప్రపంచ బ్యాంకు (World Bank) అధ్యక్ష పదవికి ఇండో అమెరికన్‌ అజయ్‌ (Ajay Banga) బంగా పేరును అమెరికా నామినేట్‌ చేసింది. గతంలో ఆయన మాస్టర్‌కార్డ్‌ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.

Updated : 23 Feb 2023 22:33 IST

వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంకు (World Bank) అధ్యక్షుడిగా ఇండో అమెరికన్‌ అజయ్‌ బంగా (Ajay Banga) పేరును అమెరికా నామినేట్‌ చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ (David Malpass) పదవీకాలం ముగియక ముందే పదవీవిరమణ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తర్వాతి అధ్యక్షుడు ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌ మాజీ సీఈవో అజయ్‌ బంగా పేరును అమెరికా నామినేట్‌ చేసింది. ఈ మేరకు అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. డేవిడ్‌ మాల్పాస్‌ ప్రకటన తర్వాత ప్రపంచ బ్యాంకు నామినేషన్లను స్వీకరించడం మొదలు పెట్టింది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికన్‌, ఐఎంఎఫ్‌ అధ్యక్షుడిగా యూరోపియన్‌ దేశానికి చెందిన వ్యక్తి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఇండో అమెరికన్‌ అయిన అజయ్‌ బంగా పేరు దాదాపు ఖారారైనట్లేనని చెప్పొచ్చు. అంతేకాకుండా వరల్డ్‌ బ్యాంకులో అత్యధిక షేర్లు అమెరికావే. అందువల్ల అధ్యక్షుడి నియామకంలో అగ్రరాజ్యం మాటే చెల్లుబాటు అవుతుంది.

63 ఏళ్ల అజయ్‌ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌లో వైస్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో మాస్టర్‌కార్డ్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. అత్యవసర సవాళ్లను పరిష్కరిస్తూ పబ్లిక్‌-ప్రైవేట్‌ వనరులను సమీకరించడంలో బంగాకు అత్యంత అనుభవముందని జో బైడెన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురువుతున్న పర్యావరణ ముప్పు లాంటి సమస్యలను ప్రభావవంతగా ఎదుర్కొనేందుకు అవసరమైన రుణసాయం చేస్తూ, ప్రపంచ అభివృద్ధికి మరింత దోహదం చేస్తారనే నమ్మకంతోనే అతడి పేరును ప్రతిపాదించినట్లు బైడెన్‌ చెప్పుకొచ్చారు.

అజయ్‌ బంగా పుణె లోని ఖడ్కీలో జన్మించారు.  దిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన.. ఆహ్మదాబాద్‌ ఐఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తూ 2016లో పద్మశ్రీతో  సత్కరించింది. 2012లో విదేశాంగ విధాన సంఘం అవార్డు సాధించారు. 2019లో ది ఎల్లిస్‌ ఐలాండ్‌ మెడల్‌ ఆఫ్ హానర్‌, బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌  గ్లోబర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని