Ukraine crisis: ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యాకు భారీ నష్టం.. పిల్లల ఆహారం ధరలూ పైపైకి!

ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. వేలాది మంది సైనికుల్ని కోల్పోవడంతో పాటు ....

Published : 13 Mar 2022 01:43 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. వేలాది మంది సైనికుల్ని కోల్పోవడంతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని నష్టపోయింది. అమెరికా సహా అనేక దేశాల విధించిన ఆంక్షలతో అక్కడ చిన్న పిల్లల ఆహారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో తమ బిడ్డల కనీస అవసరాల కోసం గతంలో కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్టు తల్లులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాలు, పాల పదార్థాల నుంచి డైపర్ల వరకూ.. ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆట వస్తువుల ధరలు సైతం రెట్టింపు అయ్యాయంటూ వాపోతున్నారు. డైపర్ల ధర గతంలో 980 రూబుల్స్ ఉండగా.. ఇప్పుడవి ఏకంగా 1700 రుబుల్స్‌కు చేరాయని వాపోతున్నారు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. రష్యన్‌ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది.  బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసి రష్యా నుంచి వైదొలిగాయి. ఈ ప్రభావంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గత వారం రష్యన్‌ ప్రజలు, వ్యాపారుల కోసం ఆర్థిక సహాయం ప్రకటించాల్సి వచ్చింది.

మరోవైపు, రష్యా సేనల దాడుల్ని ఉక్రెయిన్‌ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు 12వేల మందికిపైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. శత్రు దేశానికి చెందిన 58 విమానాలు, 83 హెలికాప్టర్లతో పాటు 362 యుద్ధ ట్యాంకులు, 1205 సాయుధ శకటాలు, 585 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులు, 33 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్స్‌లు, ఇతర యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసి రష్యాను దెబ్బతీస్తున్నట్టు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని