Robot: ప్రపంచంలోనే తొలిసారి.. రోబో సాయంతో ఐవీఎఫ్‌.. కవల పిల్లల జననం

ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్‌ విజయవంతమైంది. ఇద్దరు పండంటి ఆడపిల్లలు జన్మించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. పిల్లలు లేని జంటలకు ఉపయుక్తంగా మారే అవకాశముంది.

Published : 28 Apr 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్య రంగం మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్‌ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ఎంఐటీ టెక్నాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పెయిన్‌లోని బార్సిలోనాకి చెందిన ఓ ఇంజినీర్ల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మానవ అండంలోకి రోబో సాయంతో శుక్రకణాలను ప్రవేశపెట్టింది. రెండు పిండాలు అభివృద్ధి చెంది.. 9 నెలల తర్వాత ఇద్దరు కవలలు జన్మించారు. ఈ ప్రయోగానికి న్యూయార్క్‌ సిటీలోని న్యూహోప్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ వేదికైంది. సామాన్యులకు అందని ద్రాక్షగా మిగిలిపోతున్న సాధారణ ఐవీఎఫ్‌ స్థానంలో రోబో ద్వారా చేసిన ఐవీఎఫ్‌ అందుబాటులోకి వస్తే.. పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న చాలా జంటలకు ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది.

ఈ ప్రయోగం చేపట్టిన ఇంజినీర్లకు ఫెర్టిలిటీ అంశంపై పెద్దగా అనుభవం ఏమీ లేదు. సూదిలాంటి సన్నని రోబోను ఉంచేందుకు.. వీళ్లు సోనీ ప్లే స్టేషన్‌ 5 కంట్రోలర్‌ను ఉపయోగించారు. అందులో శుక్రకణాలను నింపి ఉంచారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచింది. అక్కడికి రెండు రోజుల వ్యవధిలో అవి ఫలదీకరణం చెంది.. పిండాలుగా మారినట్లు ఇంజినీర్ల బృందం వెల్లడించింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రసుత్తం అవలంబిస్తున్న ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌)తో పోల్చితే, దీనికయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోబోను ఓవర్‌ట్యూర్‌ లైఫ్‌ అనే స్టార్టప్‌ సంస్థ అభివృద్ధి చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్‌ ఐవీఎఫ్‌ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ ప్రయోగం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఓవర్‌ట్యూర్‌ లైఫ్‌ చెబుతోంది.

ప్రస్తుతం చాలా మంది అవలంబిస్తున్న ఐవీఎఫ్‌ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలి. చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్‌ ద్వారా పరిశీలిస్తూ అండంతో, శుక్రకణాన్ని ఫలదీకరణం చెందించాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా.. కొన్నిసారు ఇది విఫలమైన సందర్భాలూ ఉంటాయి. ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది చిన్నారులు ఐవీఎఫ్‌ ద్వారా జన్మిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని