పాకిస్థాన్‌లో ఒకేరోజు రెండు ఘోర ప్రమాదాలు

పాకిస్థాన్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. మొత్తం 59 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 30 Jan 2023 04:12 IST

బస్సు లోయలో పడి 42 మంది మృతి
పడవ బోల్తా పడి 17 మంది దుర్మరణం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. మొత్తం 59 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని లస్బెలా ప్రాంతంలో 48మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో వంతెన స్తంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం లోయలో పడ్డ బస్సుకు మంటలు వ్యాపించాయి. 42మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారి, మహిళతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిని గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పడవ మునకలో..

మరో ఘటనలో కొహాట్‌ జిల్లాలోని టండా డ్యాంలో విహారయాత్ర పడవ బోల్తాకొట్టి చెరువులో మునిగింది. ఈ ప్రమాదంలో 17మంది విద్యార్థులు మృతిచెందారు. 13మందికి గాయాలు అయ్యాయి. ‘‘పడవలో 30మంది ప్రయాణిస్తున్నారు. 17మంది మృతదేహాలను బయటకుతీశాం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం. విద్యార్థులందరూ 7 నుంచి 14 ఏళ్లలోపు వయసువారే’’ అని డిప్యూటీ కమిషనర్‌ ఫుర్కాన్‌ అష్రఫ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని