మిసిసిపీలో ఎమర్జెన్సీ ప్రకటించిన బైడెన్‌

మిసిసిపి డెల్టాను తాకిన భీకరమైన టోర్నడో, తుపాను వర్షాలతో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు.

Published : 27 Mar 2023 04:56 IST

26కు చేరిన టోర్నడో మృతుల సంఖ్య

వాషింగ్టన్‌, రోలింగ్‌ ఫోర్క్‌: మిసిసిపి డెల్టాను తాకిన భీకరమైన టోర్నడో, తుపాను వర్షాలతో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు. జరిగిన నష్టాన్ని హృదయ విదారకంగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం రాత్రి వీచిన తీవ్ర గాలులు, కురిసిన భారీవర్షానికి నష్టపోయిన కరోల్‌, హమ్‌ఫ్రేస్‌, మన్రో, షార్కీ కౌంటీలకు సమాఖ్య నిధులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తుపాను మరణాల సంఖ్య 26కు చేరగా, డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు చర్యలు ముమ్మరం చేశాయి. వందల సంఖ్యలో జనం ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఇళ్ల మరమ్మతులు, వ్యాపారాల పునరుద్ధరణకు సాయం వంటి చర్యలను సమాఖ్య నిధులతో చేపట్టవచ్చని శ్వేతసౌధం నుంచి వెలువడిన ప్రకటన పేర్కొంది.

ప్రమాదం ముగిసిపోలేదు..

ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే జాతీయ వాతావరణ విభాగం మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర గాలులు, పెద్ద వడగళ్లతో తుపాను ప్రమాదం ఉందని తూర్పు లూసియానా, దక్షిణమధ్య మిసిసిపి, దక్షిణమధ్య అలబామా ప్రాంతాలను అప్రమత్తం చేశారు. శుక్రవారం రాత్రి ఈఎఫ్‌-4 రేటింగుతో వచ్చిన టోర్నడోకు గంటకు 265 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈ ఉద్ధృతికి రెండు వేల జనాభా గల రోలింగ్‌ ఫోర్క్‌ పట్టణంలో ఇళ్లన్నీ కొట్టుకుపోయి శిథిలాలు పోగుపడగా, కార్లు తలకిందులయ్యాయి. దశాబ్దాల కిందటి ఓక్‌ చెట్ల వేర్లు బయటపడ్డాయి. మిసిసిపీలో ఆరుకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విస్తారమైన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌ పొలాలు, చేపల చెరువులు దెబ్బతిన్నాయి.

అధ్యక్షుడితో మాట్లాడిన గవర్నర్‌

అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన మిసిసిపి గవర్నర్‌ టేట్‌ రీవ్స్‌ బాధితుల పునరావాసానికి సహకారం అందిస్తామని ప్రకటించారు. ప్రాథమిక సమాచారం మేరకు గంటకు పైగా నేల మీద ఉన్న సుడిగాలి 274 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చాలా.. చాలా అరుదైన విషయమని వాతావరణ శాస్త్రవేత్త లాన్స్‌ పెరిలాక్స్‌ తెలిపారు. టెనెస్సీ, మిసిసిపి, అలబామాల్లో 75 వేల మందికి పైగా వినియోగదారులు విద్యుత్తు లేక అవస్థలు పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని