గదులే ఉండని ఉత్తుత్తి హోటల్‌

చూడటానికి అదో పెద్ద హోటల్‌. రాత్రి వేళలో కొన్ని గదులు బుకింగ్‌ అయిపోయినట్లుగా అందులోని కొన్ని కిటికీల లైట్లు వెలుగుతూ ఉంటాయి.

Published : 29 Mar 2023 04:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చూడటానికి అదో పెద్ద హోటల్‌. రాత్రి వేళలో కొన్ని గదులు బుకింగ్‌ అయిపోయినట్లుగా అందులోని కొన్ని కిటికీల లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఆశగా ఆ హోటల్‌ దగ్గరకు వెళ్తే మాత్రం భంగపాటుకు గురి కావాల్సిందే. ఎందుకంటే అక్కడ బోర్డు తప్ప నిజమైన హోటల్‌ లేదు. ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ చూడటానికి ఎలా ఉంటుందో ఆ భ్రమ కల్పించేలా నాలుగు గోడల నిర్మాణం ఉంటుంది. లోపలికి వెళ్లేందుకు మార్గం కూడా ఉండదు. పైన మాత్రం సౌర ఫలకాలను అమర్చారు. రాత్రిపూట ప్రజల్ని మాయ చేసేందుకు వాటి సహాయంతో కిటికీల్లోని లైట్లను వెలిగిస్తుంటారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగర శివారులో కేవలం వినోదం కోసం నిర్మించిన ఉత్తుత్తి హోటల్‌ కథ ఇది. కెనడాకు చెందిన కళాకారుడు క్యాలమ్‌ మోర్టాన్‌ ఈ హోటల్‌ డిజైన్‌ను రూపొందించారు. నిర్మాణానికి దాదాపు రూ.6.6 కోట్లకు పైగా వ్యయం చేశారు. కాంక్రీట్‌, ఇనుము వినియోగించి నిర్మించారు. ముందు వైపు ఆకర్షణగా ఉండేందుకు గాజు గ్లాసులను అమర్చారు. 2007 నుంచి ఈ హోటల్‌ ఈస్టర్‌లింక్‌ మోటార్‌వే పై ప్రయాణించే వాహనదారులందరినీ బోల్తా కొట్టిస్తోంది. ఆ మార్గంలో వేగంగా వెళ్తూ ఈ హోటల్‌ను చూస్తే.. ఇందులో ఓ గది దొరికితే చాలు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చనే భావన వాహనదారుల్లో పుడుతుంది. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే భవనం కేవలం 20 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఇది కేవలం అలంకారప్రాయంగా నిర్మించిన కట్టడమని తెలిసి అంతా పెదవి విరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని