SUPARCO: తొలి అడుగు తనదే.. అయినా నత్తనడకే!

భారత్‌ ఇప్పుడు చందమామపైకి వ్యోమనౌకను పంపింది! కానీ మా దేశం ఎప్పుడో చంద్రుడిపైకి వెళ్లింది. అదెలాగంటే.. జాబిల్లిపై కరెంటు ఉందా?.. లేదు కదా! మా దేశంలోనూ కరెంటు సరిగా లేదు!! చంద్రుడిపై తాగునీరు ఉందా?.. లేదు కదా.. ఇక్కడా లేదు.నెలవంకపై గ్యాస్‌ లభిస్తోందా? లేదు కదా?.. మా దేశంలోనూ దాని లభ్యత సరిగా లేదు. అందువల్ల మేం చంద్రుడిపై ఉన్నట్టే!

Updated : 22 Oct 2023 10:36 IST

పాక్‌ అంతరిక్ష ప్రస్థానం
స్వదేశంలోనే వెక్కిరింతలు
చైనా చాంగే-6 ఆర్బిటర్‌లో క్యూబ్‌శాట్‌ పంపి నష్టనివారణకు వ్యూహం

భారత్‌ ఇప్పుడు చందమామపైకి వ్యోమనౌకను పంపింది!
కానీ మా దేశం ఎప్పుడో చంద్రుడిపైకి వెళ్లింది.

అదెలాగంటే..

జాబిల్లిపై కరెంటు ఉందా?.. లేదు కదా!
మా దేశంలోనూ కరెంటు సరిగా లేదు!!
చంద్రుడిపై తాగునీరు ఉందా?..
లేదు కదా.. ఇక్కడా లేదు.
నెలవంకపై గ్యాస్‌ లభిస్తోందా? లేదు కదా?.. మా దేశంలోనూ దాని లభ్యత సరిగా లేదు.
అందువల్ల మేం చంద్రుడిపై ఉన్నట్టే!


జాబిల్లిపై చంద్రయాన్‌-3 కాలుమోపాక ఓ పాకిస్థానీయుడి స్పందన ఇది. ఇదేదో సరదాగా చేసిన వ్యాఖ్యలు కావు. శరీరంలో అణువణువునా విద్వేషం, విధ్వంసం, ఉగ్రవాదంతో నింపుకొన్న పాలకులు, సైన్యాధిపతుల తీరుతో తమ దేశం తీవ్రంగా నష్టపోయిందన్న సగటు పాక్‌ ప్రజానీకంలో గూడుకట్టుకుపోయిన ఆవేదనకు ఇది నిదర్శనం. వీరు చంద్రయాన్‌-3 విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పాక్‌ దౌర్భాగ్యాన్ని ఎండగట్టారు. భారత్‌ పట్ల విద్వేషమే ఎజెండాగా దేశాన్ని నడిపిన పాకిస్థాన్‌ పాలకులు సాధించింది ఇదీ. నేడు ఆ దేశ తీరును అక్కడి పౌరులూ ఈసడించుకుంటున్నారు. రెండు దేశాలూ ఒకేసారి స్వాతంత్య్రం పొందినప్పటికీ భారత ఇలా ముందడుగు వేయడమేంటి.. తాము దివాలా అంచుకు చేరడమేంటని వారు సామాజిక మాధ్యమాల్లో వాపోతున్నారు. భారత అంతరిక్ష విజయాలకు దీటుగా తానూ ఏదైనా సాధించాలని తలపోసిన పాక్‌ ప్రభుత్వం.. వచ్చే ఏడాది చందమామపైకి పంపే చాంగే-6 ఆర్బిటర్‌లో ఒక బుల్లి క్యూబ్‌శాట్‌ను అమర్చి పంపాలని నిర్ణయించింది. అదే తన జాబిల్లి యాత్రగా చిత్రీకరించుకోవాలనుకుంటోంది. క్యూబ్‌శాట్‌లు దాదాపు రెండు కిలోల బరువుంటాయి. వాటితో ఒనగూరే ప్రయోజనాలు నామమాత్రం.


పాక్‌: సుపార్కో

భారత్‌ కన్నా ముందే పాకిస్థాన్‌ ఒక అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది. స్పేస్‌ అండ్‌ అప్పర్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ కమిషన్‌’ (సుపార్కో) పేరుతో 1961లో ఏర్పాటైంది. అనంతరం 9 నెలల్లోనే అంటే.. 1962 జూన్‌లో అమెరికా తోడ్పాటుతో రెహబార్‌-1 అనే రాకెట్‌ను ప్రయోగించింది. తద్వారా జపాన్‌, ఇజ్రాయెల్‌ తర్వాత ఆ ఘనత సాధించిన మూడో దేశంగా అవతరించింది. ఇలా ఆరంభంలో సుపార్కో మంచి జోరును ప్రదర్శించింది. ఆ సంస్థకు చెందిన నలుగురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వద్దకు వెళ్లి, అంతరిక్ష పరిజ్ఞానంపై అధ్యయనాలు చేశారు. వారిలో అబ్దుస్‌ సలామ్‌ కూడా ఒకరు. ఆయన సుపార్కోకు వ్యవస్థాపక డైరెక్టర్‌. 1979లో ఆయన భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి కూడా గెల్చుకున్నారు. పాక్‌ సాధించిన ఏకైక నోబెల్‌ ఇదే.

తదుపరి దశాబ్దంలో అనేక సౌండింగ్‌ రాకెట్లను సుపార్కో ప్రయోగించింది. అమెరికా, చైనా సాయంతో పలు కార్యక్రమాలను ప్రారంభించింది.


భారత్‌: ఇస్రో

సుపార్కో ఏర్పడ్డ కొన్ని నెలల తర్వాత అంటే.. 1962లో నాటి భారత ప్రధాని నెహ్రూ.. రోదసి పరిశోధనల కోసం ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ (ఇంకోస్పార్‌)ను ఏర్పాటు చేశారు. 1969లో అది ఇస్రోగా రూపాంతరం చెందింది. భారత్‌ తన తొలి సౌండింగ్‌ రాకెట్‌ను 1963 నవంబరు 21న ప్రయోగించింది. అప్పటికే ఏడాదిన్నర కిందట ఆ ఘనతను పాక్‌ సాధించింది. అంటే పొరుగు దేశానిదే ముందంజ అన్నమాట.


కట్‌ చేస్తే..

2023 ఆగస్టు 23న భారత చంద్రయాన్‌-3 జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగింది. తద్వారా ఆ ప్రాంతాన్ని చేరిన తొలి దేశంగా అవతరించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య-ఎల్‌1, తాజాగా గగన్‌యాన్‌ ప్రాజెక్టులో తొలి అంచె కింద టీవీ-డీ1 ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రపంచ రోదసి శక్తిగా ఎదిగింది. సుపార్కో మాత్రం దశాబ్దాలు వెనుకబడి ఉంది. ఇప్పుడు ఆ దేశం నెత్తీనోరూ కొట్టుకుంటోంది.

ఇందుకు కారణం సైన్స్‌ను పక్కనపెట్టేసి ఉగ్రవాద మార్గాన్ని ఆశ్రయించడం. నైపుణ్యానికి బదులు ఛాందసవాదాన్ని నమ్ముకోవడమే. ఇదేమీ ఓ భారతీయుడి విశ్లేషణ కాదు. స్వయాన పాకిస్థానీ యువత సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న కామెంట్లు.


అహ్మదీయ అని.. !

ప్రముఖ శాస్త్రవేత్త అయిన సలామ్‌ను.. అహ్మదీయ తెగకు చెందిన వ్యక్తి కావడం వల్ల పాక్‌ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. పాక్‌ ప్రభుత్వం ఈ మైనార్టీ వర్గాన్ని ముస్లింలలో భాగంగా పరిగణించడంలేదు. 1974లో ఈ మేరకు రెండో రాజ్యాంగ సవరణ తెచ్చింది. దీనికి నిరసనగా సలామ్‌ పాక్‌ను వీడి, బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఆయన అంతకుముందు దేశంలో పరిశోధన హబ్‌లను ఏర్పరిచారు. నాసాతో శిక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సలామ్‌.. పాక్‌ నుంచి వైదొలిగినప్పుడే సుపార్కో పతనానికి బీజాలు పడ్డాయి.


బడ్జెట్‌లో ఎంత వైరుధ్యం!

సైనిక బడ్జెట్‌ను ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్న పాక్‌ సైన్యం.. సైన్స్‌కు మాత్రం అరకొర కేటాయింపులు చేపట్టింది. అంతరిక్ష రంగానికి భారత్‌ ఈ ఏడాది రూ.12,543 కోట్లు కేటాయించగా.. పాకిస్థాన్‌ మాత్రం రూ. 739.51 కోట్లు (పాక్‌ రూపాయిలు) ఇచ్చింది. భారత కరెన్సీలో ఇది రూ.198 కోట్లతో సమానం. అంటే మన చంద్రయాన్‌-3 వ్యయం (రూ.615 కోట్లు) కన్నా చాలా తక్కువన్నమాట!


ఎందుకు వెనుకబాటు?

పాకిస్థాన్‌ అంతరిక్ష సంస్థది ఆరంభ శూరత్వమే అయింది. మొదట్లో జోరు ప్రదర్శించిన సుపార్కో.. ఆ తర్వాత వెనుకబడిపోయింది. కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగిన భారత్‌ మాత్రం పట్టును కొనసాగించింది. ఇస్రో తన తొలి ఉపగ్రహం ఆర్యభట్టా-1ను 1975లో ప్రయోగించగా.. పాక్‌ మాత్రం తన మొదటి శాటిలైట్‌ బాదర్‌-1ను చైనా సాయంతో 1990లో నింగిలోకి పంపింది.

  • ఆ తర్వాత సుపార్కో తన రెండో ఉపగ్రహాన్ని (బాదర్‌ బి) ప్రయోగించడానికి 2001 వరకూ ఆగాల్సి వచ్చింది. ఇస్రో మాత్రం 1979లో తన రెండో శాటిలైట్‌ (భాస్కర)ను రోదసిలోకి పంపింది.
  • ఈ వైరుధ్యానికి కారణం.. 1980ల నుంచి పాక్‌ అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో పతనం మొదలు కావడమే. నాటి దేశాధ్యక్షుడు జియా ఉల్‌ హక్‌.. సుపార్కోకు నిధులు కత్తిరించేసి.. ఆ సొమ్మును అణుబాంబుల తయారీకి మళ్లించారు.

సైనిక పెత్తనం..: ఇస్రోకు నిపుణులైన శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తుండగా.. సుపార్కోకు మాత్రం గత రెండు దశాబ్దాలుగా సైనికాధికారులు నేతృత్వం వహిస్తున్నారు. పోనీ వీరు గొప్ప చదువులు ఏమైనా చదివారా అంటే అదీ లేదు. చివరి నలుగురు సుపార్కో అధిపతుల్లో ముగ్గురికి బీఎస్సీ డిగ్రీలు మాత్రమే ఉన్నాయి. ఒకరికి ఎమ్మెస్సీ పట్టా ఉంది. వీరెవరూ అంతరిక్ష రంగంలో నిపుణులు కాదు. చివరిసారిగా సుపార్కోకు 1997 నుంచి 2001 మధ్య ఒక శాస్త్రవేత్త నేతృత్వం వహించారు.

  • సకాలంలో ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టకపోవడం వల్ల సుపార్కో తాను పొందిన ఆర్బిటల్‌ స్లాట్‌లను కోల్పోవాల్సి వచ్చింది.
  • పాక్‌ ఇప్పుడు తీరిగ్గా ‘మిషన్‌ 2040’పై కసరత్తు చేపట్టింది. అప్పటికల్లా దేశీయంగా ఉపగ్రహ తయారీ, ప్రయోగ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని