Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: 40 మంది మృతి.. 300 మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్ ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కంటైనర్ డిపోలో జరిగిన

Updated : 05 Jun 2022 15:18 IST

చిట్టగాంగ్‌ :  బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని ఓ షిప్పింగ్‌ కంటైనర్‌ డిపోలో భారీ రసాయన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సమాచారం. 300 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు.

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీతాకుందలోని కంటైనర్‌ డిపోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతం చిట్టగాంగ్‌కు 40 కి.మీ దూరంలో ఉంది. రసాయనాలు కలిగి ఉన్న చాలా కంటైనర్లు పేలినట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. మంటలను అదుపు చేస్తూ 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది పోలీసులు గాయపడినట్లు చిట్టగాంగ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇళ్లు..
పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. శిథిలాలు అరకిలోమీటరు దూరంలోని ఇళ్లపై కూడా పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమం..
క్షతగాత్రులతో సమీపంలోని ఆస్పత్రులు నిండిపోయాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మందికి 60 నుంచి 90 శాతం వరకూ కాలిన గాయాలయ్యాయని వైద్యులు చెబుతున్నారు. 

రంగంలోకి సైన్యం..
పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని