South Korea: అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అంతం చేస్తాం..! కిమ్‌కు హెచ్చరిక

ఉత్తర కొరియా ఒకవేళ అణ్వాయుధాలే ఉపయోగిస్తే.. దక్షిణ కొరియా- అమెరికా కూటమి ప్రతిస్పందనతో కిమ్‌ పాలన అంతం అవుతుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ హెచ్చరించారు.

Published : 26 Sep 2023 17:42 IST

సియోల్‌: వరుస క్షిపణి ప్రయోగాలు, కవ్వింపు చర్యలతో ఉత్తర కొరియా (North Korea) నుంచి ముప్పు ఎదుర్కొంటున్న వేళ.. దక్షిణ కొరియా (South Korea) సేనలు సియోల్‌ వీధుల్లో కదం తొక్కాయి. 75వ ‘సాయుధ బలగాల దినోత్సవం (Armed Forces Day)’ పురస్కరించుకుని నిర్వహించిన సైనిక కవాతు (Military Parade)లో భాగంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. ఈ స్థాయి ప్రదర్శన పదేళ్లలో ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేసేందుకు పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మిస్తామని దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol) ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అమెరికాతో కలిసి కిమ్‌ (Kim Jong Un) పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు.

యుద్ధ ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలు, డ్రోన్లు, ఉత్తర కొరియాలోని ఏ మూలకైనా చేరుకోగల శక్తిమంతమైన బాలిస్టిక్‌ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థలను దక్షిణ కొరియా ప్రదర్శించింది. వేలాది మంది సైనికులు రైఫిళ్లు, జెండాలతో పరేడ్‌లో పాల్గొన్నారు. 300 మంది అమెరికన్‌ సైనికులూ ఇందులో భాగమయ్యారు. 2013 తర్వాత ఇదే అతిపెద్ద మిలిటరీ పరేడ్‌ అని స్థానిక అధికారులు పేర్కొన్నారు. శత్రువులో భయాన్ని పుట్టించే బలమైన మిలిటరీని నిర్మించేందుకు కృషి చేస్తానని దేశాధ్యక్షుడు యోల్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఒకవేళ అణ్వాయుధాలే ఉపయోగిస్తే.. దక్షిణ కొరియా- అమెరికా కూటమి ప్రతిస్పందనతో కిమ్‌ పాలన అంతం అవుతుందని పేర్కొన్నారు.

అణుదాడికి సిద్ధంగా ఉండండి..: కిమ్‌ జోంగ్‌ ఉన్‌

గతేడాది అధికారం చేపట్టిన యూన్‌ సుక్‌ యోల్‌.. దక్షిణ కొరియా సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఉ.కొరియాను ఎదుర్కొనేందుకు, దాని అణ్వాయుధ ఆశయాలను నిలువరించేందుకుగానూ అమెరికాతో కలిసి సైనిక కసరత్తులను విస్తరిస్తున్నారు. మరోవైపు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల రష్యాలో పర్యటించడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా, ప్రతిఫలంగా కిమ్‌ క్షిపణి కార్యక్రమాలకు మాస్కో సాయం అందేలా ఒప్పందాలు జరుగుతాయేమోనని అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటే ఊరుకోమని యూన్‌ సుక్‌ యోల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని