భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి

భారత్‌ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు.

Published : 23 Sep 2023 05:10 IST

చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందాలి
వివేక్‌ రామస్వామి

వాషింగ్టన్‌: భారత్‌ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందాలంటే భారత్‌, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్‌ చెప్పినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ ఓ కథనంలో పేర్కొంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఆయన నాలుగు అంశాలతో ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించింది. అమెరికా ఫార్మా రంగం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్‌, ఇజ్రాయెల్‌తో సంబంధాలను విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కంప్యూటర్‌ చిప్స్‌ తయారీ కోసం ఉపయోగించే లిథియం వంటి ఖనిజాల దిగుమతి కోసం చైనాకు బదులుగా భారత్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలను ఆశ్రయించాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం ఉపయోగించే ఖనిజాల కోసం అమెరికా అధికంగా చైనాపైనే ఆధారపడుతోందని, ఫలితంగా అమెరికా అందించే సబ్సిడీలతో పరోక్షంగా చైనాకు లబ్ధి చేకూరుతుందని వివేక్‌ తెలిపారు. దానికి బదులుగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీకి అవసరమైన మినరల్స్‌ను భారత్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని అన్నారు. చిప్స్‌ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని రామస్వామి అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని