Israel-Iran: ఇరాన్‌లో కోవర్ట్‌ ఆపరేషన్లకు ఇజ్రాయెల్‌ కట్టప్పలు..?

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఇప్పటి వరకు ముసుగులో సాగిన పరోక్ష యుద్ధం.. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందా అనే భయాలు  మొదలయ్యాయి. ఇప్పటికే యూరేషియా ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్‌

Updated : 14 Jun 2022 11:33 IST

యుద్ధం అంచున ఇరుదేశాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకొన్నాయి. ఇప్పటి వరకు ముసుగులో సాగిన పరోక్ష యుద్ధం.. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతోందా.. అనే భయాలు  మొదలయ్యాయి. ఇప్పటికే యూరేషియా ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచం సతమతమవుతుంటే.. ఇప్పుడు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అణుబాంబు తయారీకి ఇరాన్‌ చేరువగా వెళుతోందనే సమాచారంతో ఇజ్రాయెల్‌ ఒక్కసారిగా అప్రమత్తమైపోయింది. తన కీలక ఆయుధాలకు పదునుపెట్టడంతోపాటు.. ఇరాన్‌ మిత్రదేశాల్లోని తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరుతోంది. 

ఇరాన్‌ అణు సామర్థ్యమే లక్ష్యంగా ఎఫ్‌-35లకు పదును 

ఇరాన్‌ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ పనిచేస్తోంది. తాము అవసరమైతే ఇరాన్‌పై ముందస్తు దాడి చేయడానికీ వెనుకాడమని గతంలోనే ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇటువంటి ఆపరేషన్‌కు అనుగుణంగా వాడుకొనేలా ఆయుధాలను సిద్ధం చేస్తోంది. తాజాగా అత్యాధునిక స్టెల్త్‌ విమానం ఎఫ్‌-35ను ఎటువంటి గగనతల ఇంధన రిఫ్యూయలింగ్‌  అవసరం లేకుండా ఇరాన్‌లోని లక్ష్యాలను చేరుకొని వచ్చేలా మార్పులు చేసినట్లు జెరుసలెం పోస్టు ప్రకటించింది. దీంతోపాటు రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ వెపన్‌ సిస్టమ్‌ తయారు చేసిన టన్ను బరువైన బాంబును ప్రయోగించేలా మార్పులు చేశారు. అదే సమయంలో విమానం స్టెల్త్‌ దెబ్బతినకుండా చూసుకొన్నారు. ఇరాన్‌ రాడార్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కూడా ఇప్పటికే ఇజ్రాయెల్‌ వాయుసేన సాధన చేసింది.

గతంలో ఇరాక్‌ అణ్వాయుధ తయారీ ప్లాంట్‌ను ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ ఒపేరా’ నిర్వహించి ధ్వంసం చేసింది. ఇరాక్‌ 1976లో ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన ఓ న్యూక్లియర్‌ రియాక్టర్‌ను బాగ్దాద్‌కు 17  కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని ఇజ్రాయెల్‌ గుర్తించింది. దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్‌ 7వ తేదీ ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధవిమానాలు ఆ కేంద్రంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్‌ గగనతల నిఘా రాడార్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. అంతే ఇజ్రాయెల్‌ విమానాలు ఆ అణు రియాక్టర్‌పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. క్షణాల్లో ఈ ఆపరేషన్‌ ముగిసిపోయింది.

లెబనాన్‌, ఇరాక్‌ వంటి ప్రాంతాల్లో హెజ్బోల్లా గ్రూప్‌నకు ఆయుధాల ఎగుమతికి ఇరాన్‌ ముఖ్యంగా సిరియా మార్గాన్ని ఎంచుకొంటోంది. తాజాగా ఇరాన్‌కు చెందిన ఆయుధాలను సిరియాలో డమాస్కస్‌ విమానాశ్రయంలో ఇజ్రాయెల్‌ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఇటీవల సిరియాలోని ఐఆర్‌జీసీ సంస్థ స్థావరాలు, నాయకులను ఇజ్రాయెల్‌ నేరుగా లక్ష్యంగా చేసుకొంటోంది. తాజా దాడి కూడా దానిలోని భాగమే.

ఇస్తాంబుల్‌ను వీడండి.. తమ పౌరులకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక..

ఇజ్రాయెల్‌ వాసులు టర్కీ నగరం ఇస్తాంబుల్‌కు ప్రయాణించవద్దని.. ఇప్పటికే అక్కడ ఉంటే వెంటనే ఆ నగరాన్ని వీడాలని హెచ్చరించింది. ఇరాన్‌ ప్రోత్సాహంతో ఇజ్రాయెల్‌ ప్రజలపై దాడి జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇస్తాంబుల్‌పై లెవల్‌-4 హెచ్చరికను జారీ చేసింది. టర్కీపై లెవల్‌-3 హెచ్చరికలను విడదల చేసింది. ఇరాన్‌కు చెందిన ఖుద్స్‌ఫోర్స్‌ విభాగాలు ఇక్కడ ఇజ్రాయెల్‌ ప్రజలను లక్ష్యంగా చేసుకోనున్నాయనే నమ్మకమైన సమాచారంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది.

కోవర్ట్‌ ఆపరేషన్లకు పదును..

ఓ వైపు సైనిక దళాలను సిద్ధం చేసుకొంటూనే ఇజ్రాయెల్‌ కోవర్టు ఆపరేషన్లకు మరింత పదును పెట్టింది. ఇరాన్‌ శాస్త్రవేత్తలు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్లను లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్‌ వైమానిక పరిశ్రమలో పనిచేస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు 13వ తేదీన అల్‌జజీరా పత్రిక పేర్కొంది. ఖొమేని నగరంలో ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌ డివిజన్‌లో పనిచేస్తున్న అలీ కమానీ అనే ఇంజినీరు అనుమానాస్పద స్థితిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏరోస్పేస్‌ విభాగంలో పనిచేసే మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఇరాన్‌ పత్రిక ఫార్స్‌న్యూస్‌ పేర్కొంది. ఇరాన్‌.. పైకి ఇవి సాధారణ మరణాలే అని చెబుతున్నా.. వీరిద్దరికి  ‘అమర వీరుల’ హోదాను ఇచ్చింది. సాధారణంగా ఇరాన్‌లో ప్రత్యర్థులతో పోరాడుతూ మరణించిన వారికే ‘అమరవీరుల’ హోదా దక్కుతుంది. ఈ వరుస హత్యలపై ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్‌ ఖతీబ్జాదే మాట్లాడుతూ ‘‘ఇజ్రాయెల్‌ ఉగ్రవాదులకు సరైన చోట.. సరైన సమయంలో సమాధానం చెబుతాం’’ అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ల అభివృద్ధి ప్రాజెక్టులో పనిచేస్తున్న కీలక శాస్త్రవేత్త  అయూబ్‌ ఎతెజారె అనుమానాస్పద స్థితిలో మే 31వ తేదీన మృతి చెందారు. ఒక వేడుకలో ఆహారం తిన్నాక అతడు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత ఆ పార్టీ ఇచ్చిన వ్యక్తి దేశం విడిచిపారిపోయాడని ‘న్యూయార్క్‌ పోస్టు ’కథనంలో పేర్కొంది. ఇరాన్‌ అత్యంత రహస్యంగా అభివృద్ధి చేస్తున్న క్షిపణి ప్రాజెక్టులో అయూబ్‌ కీలక శాస్త్రవేత్తగా పేర్కొంది. ఇరాన్‌ ఒక వేళ అణుబాంబును తయారు చేస్తే.. దానిని ప్రయోగించే సామర్థ్యమున్న క్షిపణిని తయారు చేయనీయకుండానే ఈ కోవర్టు ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఇప్పటికే ఇరాన్‌ ఐఆర్‌జీసీ ఖుద్స్‌ ఫోర్స్‌లోని  ‘యూనిట్‌ 840’ దళంలో సీనియర్‌ కర్నల్‌ హసన్‌ సయ్యద్‌ ఖొదాయోను ఇరాన్‌ రాజధాని  టెహ్రాన్‌లో పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కర్నల్‌ అలీ ఇస్మాయిల్‌ జాదే  ఆ తర్వాత కొన్ని వారాలకే అనుమానాస్పదంగా మృతి చెందాడు. 

ఇరాన్‌ అణుదిశగా అడుగులు..

ఇరాన్‌ అణ్వాయుధం తయారీ దిశగా అడుగులు వేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. నటాంజ్ అణు కేంద్రంలోని కెమెరాలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.  టెహ్రాన్‌కు దాదాపు 250 మైళ్ల దూరంలో ఈ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. యురేనియం-238 శుద్ధి చేసి ఆయుధాలకు అవసరమైన యూ-235ను తయారు చేస్తారు. ఈ శుద్ధికి సెంట్రిఫ్యూజిలు అనే పరికరాలను వాడతారు. మొదటి తరం సెంట్రిఫ్యూజ్‌ కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో యురేనియంను శుద్ధి చేసే ఐఆర్‌-6 సెంట్రిఫ్యూజ్‌లను నటాంజ్‌లో నెలకొల్పదలచినట్లు ఇరాన్‌ గతంలోనే తెలిపింది. అణ్వస్త్ర తయారీకి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం కావాలి. ఇరాన్‌ ఇంతవరకు 60 శాతం శుద్ధి సామర్థ్యాన్ని సంతరించుకుంది. దీంతో ముందస్తుదాడికి కూడా వెనుకాడమని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని