Lavrov: ‘హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉంది..!’ దుమారం రేపుతోన్న లావ్రోవ్‌ వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది...

Published : 03 May 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటలీకి చెందిన ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో లావ్రోవ్‌ ఈ మేరకు మాట్లాడారు. ఉక్రెయిన్‌ను ‘డీ-నాజీఫై’ చేస్తామంటున్న రష్యా తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందన్నదానిపై లావ్రోవ్ బదులిస్తూ.. ‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఓ యూదు అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీజం ఉనికి ఉండొచ్చు. నేను తప్పు కావచ్చు.. కానీ, హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉంది. అదేం విషయం కాదు’ అని అన్నారు. దీంతో లావ్రోవ్‌ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్ స్పందిస్తూ.. ఇలాంటి అబద్ధాలు చరిత్రలో భయంకరమైన నేరాలకు యూదులనే నిందించడానికి ఉద్దేశించినవన్నారు. లావ్రోవ్ వ్యాఖ్యలు క్షమించరానివని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యైర్ లాపిడ్ మండిపడ్డారు. హోలోకాస్ట్‌లో యూదులు తమనుతాము చంపుకోలేదన్నారు. రష్యా రాయబారిని పిలిపించి.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇజ్రాయెల్‌లోని వరల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్ ‘యాద్ వాషెమ్’ డైరెక్టర్ డాని దయాన్.. లావ్రోవ్‌ వ్యాఖ్యలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌ను డీ-మిలిటరైజ్‌, డీ-నాజీఫై చేయడమే తమ లక్ష్యమని రష్యా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని