Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!

అధికారిక నివాసంలో (Prime Minister) ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడంపై వచ్చిన విమర్శలకు బాధ్యుడిని చేస్తూ తన కుమారుడిని కీలక పదవి తప్పిస్తున్నట్లు జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida) ప్రకటించారు.

Published : 30 May 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు (Fumio Kishida) చుక్కెదురయ్యింది. తనకు (ప్రధాన మంత్రికి) రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ఆయన కుమారుడు షొటారో కిషిదాను పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ప్రధాని అధికారిక నివాసంలో (Prime Minister) ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడమే ఇందుకు కారణమయ్యింది. డిసెంబర్‌ 30 తన బంధువులతో ఇంట్లో పార్టీ చేసుకోవడం, ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోలపై తీవ్ర విమర్శలు రావడంతో కుమారుడిపై ప్రధాని కిషిద చర్యలు తీసుకున్నారు.

కిషిద కుమారుడితోపాటు పలువురు బంధువులు ప్రధాని నివాసంలో ఓ పార్టీకి హాజరయ్యారు. ఆ సందర్భంగా అధికారం నివాసంలో ఉన్న రెడ్‌ కార్పెట్‌ మెట్లపై నిలబడి.. కొత్తగా కేబినెట్‌లో నియమితులైనవారిగా ఫొటోలకు పోజులిచ్చారు. మధ్యలో ప్రధాని కుమారుడు (ప్రధాని ఉండాల్సిన చోట) నిలబడి ఫొటోలు దిగారు. దీంతోపాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లుగా.. పోడియం వద్ద అతిథులుగా నిల్చొని మరిన్ని ఫొటోలు తీసుకున్నారు. తాజాగా వీటన్నింటినీ స్థానిక మ్యాగజైన్‌ బయటపెట్టింది. దీంతో పీఎం కుమారుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కీలక పదవి నుంచి తన కుమారుడిని తప్పిస్తున్నట్లు ప్రధాని కిషిద ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఇదేం తొలిసారి కాదు. బ్రిటన్‌, ప్యారిస్‌ పర్యటనలో భాగంగా ప్రైవేటు పర్యాటనకు అక్కడి ఎంబసీ కార్లను ఉపయోగించి విమర్శల పాలయ్యారు.

తాజా ఘటనపై జపాన్‌ ప్రధాని ఫుమియో స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘పీఎంకు రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న వ్యక్తి చేసిన చర్యలు అనుచితమైనవి. అందుకు ఆయనను బాధ్యుడిగా చేస్తూ.. ఆ పదవి నుంచి తొలగిస్తున్నాను. ఆయన స్థానంలో మరోవ్యక్తిని నియమించాలని నిర్ణయించాను’ అని కిషిద పేర్కొన్నారు. అయితే, అప్పుడు జరిగిన పార్టీకి వచ్చిన వారికి తానూ శుభాకాంక్షలు తెలిపానని.. కానీ, డిన్నర్‌ సమయంలో అక్కడ లేనని ప్రధాని కిషిద అంగీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని