Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్‌ పూర్తి

30 సెకన్ల సమయంలో ఏం చేయగలం..? కనీసం కాఫీ కూడా పూర్తిగా తాగలేం..! అలాంటిది ఓ గ్రామంలోని ఓటర్లు అరసెకనులో ఏకంగా 100శాతం ఓటింగ్‌ పూర్తిచేశారు. ఓటు వేయడంలో వారి రికార్డును వారే బద్దలుకొట్టారు.

Published : 29 May 2023 17:15 IST

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అయినప్పటికీ.. కొందరు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇంకొందరేమో అన్ని పనులు పూర్తి చేసుకుని నిదానంగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్దామనుకుంటారు. అంతేగానీ, సమయం కంటే ముందే పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు (Voting) వేసేందుకు ఎదురుచూసేవారు ఉండటం చాలా అరుదు. కానీ, ఆ గ్రామంలో ఓటర్లు అలా ఎదురుచూడటమే గాక.. పోలింగ్‌ మొదలైన అర నిమిషంలోపే అందరూ ఓటేసి 100శాతం పోలింగ్‌ నమోదు చేశారు. ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారు కదా..! అదెలా అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి..!

స్పెయిన్‌ (Spain) దేశంలోని లా రియోజా ప్రావిన్స్‌లో విల్లారోయా (Villaroya) అనే కుగ్రామం ఉంది. కేవలం పదుల సంఖ్యలో జనాభా మాత్రమే ఉండే ఈ గ్రామంలో ఓటు హక్కు ఉన్నవారు ఏడుగురు. అయితేనేం.. ఓటు వేయడంలో ముందుండి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆదివారం (మే 28న) ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా.. వీరు సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం 29.53 సెకన్లలో వీరంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో 32 సెకన్లలో వీరు ఓటింగ్‌ (Voting) పూర్తి చేయగా.. ఇప్పుడు వారి రికార్డును వారే బద్దలుకొట్టారు.

దీనిపై ఆ ప్రాంత మేయర్‌ సాల్వడార్‌ పెరెజ్‌ మాట్లాడుతూ.. ‘ఈ గ్రామస్థులు ఓటు వేయడంలో అత్యంత నైపుణ్యం కలవారు. పోలింగ్ కేంద్రానికి ముందే వచ్చి ఎదురుచూస్తారు. పోలింగ్ మొదలవ్వగానే వీలైనంత వేగంగా ఓటు వేస్తారు. అలా ఈ సారి 30 సెకన్లలోపే ఓటింగ్‌ పూర్తి చేశారు. స్పెయిన్‌లో ఓటింగ్‌ పూర్తిచేసే తొలి ప్రాంతం విల్లారోయా గ్రామమే’’ అని తెలిపారు. ఏదేమైనా.. నేటి యువతకు ఈ విల్లారోయా ఓటర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు