Elon at Twitter: ట్విటర్‌ బోర్డులో ఎలాన్‌ మస్క్‌..!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌లోకి టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రవేశించారు.

Published : 05 Apr 2022 23:08 IST

స్వాగతం పలికిన ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌

దిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌లోకి టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రవేశించారు. సంస్థలో 9శాతం వాటాను సొంతం చేసుకున్న మస్క్‌ను తాజాగా తమ బోర్డులోకి స్వాగతిస్తున్నట్లు ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ నియామకం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ఆయన.. ఇటీవల మస్క్‌తో జరిపిన చర్చల అనంతరం తమ సంస్థకు ఆయన మరింత విలువను తెస్తారని స్పష్టంగా తెలిసిందన్నారు.

‘సేవలపై విశ్వాసంతోపాటు విమర్శలనూ చేయగల వ్యక్తి ఎలాన్‌ మస్క్‌. తమ సంస్థ, బోర్డుకు కూడా ఇటువంటివే అవసరం. రానున్న రోజుల్లో ఈ సామాజిక మాధ్యమాన్ని మరింత బలోపేతం చేస్తాడనే విశ్వాసం ఉంది’ అంటూ ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇందుకు బదులిచ్చిన మస్క్‌.. ట్విటర్‌ను గణనీయంగా మెరుగుపరిచేందుకు పరాగ్‌తోపాటు బోర్డుతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇక ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో వాటా తీసుకోవడాన్ని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌ డోర్సే కూడా స్వాగతించారు.

ఇదిలాఉంటే, ట్విటర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ట్విటర్‌లో వాక్‌ స్వాత్రంత్యంపై ప్రశ్నలు పెరుగుతున్నాయని విమర్శించారు. కొత్త సామాజిక మాధ్యమాన్ని సృష్టించే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన కొత్త సోషల్‌మీడియాను తీసుకొస్తారని అంతా భావించినప్పటికీ ట్విటర్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచారు. తాజాగా ట్విటర్‌ బోర్డులో నియామకం అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు