Earthquake: గంటల వ్యవధిలో.. తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

తుర్కియే (Turkey)లో మరోసారి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గంటల వ్యవధిలో వరుస భూకంపాలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Published : 06 Feb 2023 17:37 IST

అంకారా: ప్రకృతి విలయంలో అల్లాడిపోతున్న తుర్కియే (Turkey)లో మరోసారి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.24 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. ఆగ్నేయ తుర్కియేలోని ఎకినోజు ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. తాజా భూకంపం ధాటికి తుర్కియేతో పాటు సిరియాలోని డమాస్కస్‌, లటాకియా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తుర్కియే, సిరియా (Syria) దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. దీని తర్వాత నిమిషాల వ్యవధిలో దాదాపు 20 సార్లు శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ధాటికి వేలాది భవనాలు నేలమట్టాయి. ఈ విలయంలో ఇరు దేశాల్లో 1600 మందికి పైగా మృతిచెందారు. ఒక్క తుర్కియే (Turkey)లోనే 912 మంది మృతిచెందినట్లు అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వెల్లడించారు. తమ దేశ చరిత్రలోనే అత్యంత భారీ విపత్తు ఇది ఆయన పేర్కొన్నారు.

తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంపం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా నమోదవుతోంది. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. అయితే మంచు ఎక్కువగా పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని