Japan: పితృత్వ సెలవులు ఇస్తామంటే.. భయపడిపోతున్న తండ్రులు

జనాభా సంక్షోభాన్ని నివారించడానికి జపాన్‌ (Japan) ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పితృత్వ సెలవులు ఇస్తామని చెబుతున్నా.. కొత్తగా తండ్రైన వారు మాత్రం భయపడిపోతున్నారని సమాచారం.

Published : 28 Mar 2023 01:35 IST

టోక్యో: జపాన్‌లో (Japan) జనాభా సంక్షోభాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే పితృత్వ సెలవులకూ (Paternity Leave) చట్టబద్ధత కల్పించింది. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల రానున్న దశాబ్ది కాలంలో జనాభా క్షీణతను నివారించవచ్చని భావిస్తోంది. ఇలా ప్రభుత్వం పితృత్వ సెలవులు ఇస్తామని చెప్పినప్పటికీ తండ్రులు మాత్రం వాటిని తీసుకునేందుకు భయపడుతున్నారట.

పితృత్వ సెలవులు తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు జపాన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు విధానాలను రూపొందించిన కిషిదా ప్రభుత్వం.. పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవులకు చట్టబద్ధత కల్పించింది. తద్వారా ప్రస్తుతం ఈ సెలవులు తీసుకుంటున్న 14 శాతం ఉద్యోగుల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి, 2030 నాటికి 85 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇవి ఏమేరకు ప్రభావవంతంగా ఉంటాయనే సందేహాలు జపాన్‌ పౌరుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పితృత్వ సెలవులు తీసుకోవడం వల్ల సంస్థ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

నిబంధనల ప్రకారం.. నాలుగు వారాల పితృత్వ సెలవులు తీసుకునే ఉద్యోగికి వారి జీతంలో 80శాతం అందుతుంది. అయినప్పటికీ ప్రమోషన్‌ కోణంలో అది ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాలు వారిని వెంటాడుతున్నాయి. లేదా సెలవుల అనంతరం వారికి ఇతర బాధ్యతలు అప్పజెప్పే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అయితే, అటువంటి సెలవులు తీసుకున్న ఉద్యోగి పట్ల వివక్ష చూపడం నేరమని కార్మిక సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా కొన్ని చిన్న సంస్థల్లో పనిచేసే వారు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, జపాన్‌లో కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పాలకులు.. జననాల రేటు క్షీణించడం ఇదే తీరుగా కొనసాగితే జపాన్‌ అదృశ్యమవుతుందని భయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు