North Korea: వారం వ్యవధిలో 20 లక్షల కేసులు.. 7 లక్షల మంది క్వారంటైన్‌లో..!

ఉత్తరకొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. వారం క్రితం ఆ దేశం మొదటి కేసును ధ్రువీకరించింది.

Published : 19 May 2022 15:26 IST

ప్యాంగాంగ్‌: ఉత్తరకొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. వారం క్రితం ఆ దేశం మొదటి కేసును ధ్రువీకరించింది. ఈ లోపే కేసుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరింది. గురువారం ఒక్కరోజే 2,62,270 మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. ఒక మరణం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దాంతో మృతుల సంఖ్య 63కు  చేరింది. 

కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. ఏప్రిల్ చివరి నుంచి ఇప్పటివరకూ 1.98 మిలియన్ల మందిలో జ్వరం లక్షణాలు కనిపించాయి. దాదాపు 7,40,160 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రజల అనారోగ్యానికి జ్వరం కారణమని ఆ దేశం చెప్తోంది. ఇప్పటికే అక్కడ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. ఈ అనారోగ్యాలకు మూలం ఒమిక్రానేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బలహీన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు కిమ్ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. కిమ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో లెక్కల్ని తక్కువ చేసి చూపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ, మహమ్మారి కారణంగా సరిహద్దుల మూసివేత, అణ్వాయుధాల సమీకరణతో ఎదుర్కొంటోన్న ఆంక్షలు.. ఉత్తర కొరియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమయంలో వైరస్‌ కట్టిడికి ఉత్తర కొరియాలో లాక్‌డౌన్ విధించి పూర్తిగా స్తంభింపజేయడం సాధ్యం కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఆహార కొరతను ఎదుర్కొంటోన్న ఆ దేశం వరి నాట్లు వేసే కాలంలో కఠిన ఆంక్షలు విధించే పరిస్థితి లేదు. అక్కడ నిర్మాణ రంగంలో పనులు ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు అక్కడి వార్తా సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరోనా కట్టడికి ఐరాస చేస్తానన్న టీకా సహాయాన్ని కాదనుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు కిమ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని