Omicron: ‘ఒమిక్రాన్‌తో దీర్ఘకాలిక ప్రభావం.. బూస్టర్‌ డోసులు తీసుకోవాల్సిందే’

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ స్వల్పం కాదని.. దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ యోనస్‌ వెల్లడించారు......

Published : 28 Jan 2022 19:22 IST

ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ యోనస్‌

వాషింగ్టన్‌: కరోనా తాజా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. ఆయా దేశాల్లో నమోదవుతున్న అత్యధిక కేసులు ఇవేనని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే వ్యాప్తి అత్యధికంగానే ఉన్నప్పటికీ ప్రభావం తక్కువగా ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా.. ప్రభావం తీవ్రంగానే ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ స్వల్పం కాదని.. దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ యోనస్‌ వెల్లడించారు. బూస్టర్‌ డోసులు తీసుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని ట్విటర్‌ వేదికగా సూచించారు.

‘ఒమిక్రాన్‌ తేలికపాటిది కాదు. దీర్ఘకాలిక లక్షణాలతోపాటు తీవ్ర ప్రభావం చూపుతుంది. మరణాలు అధికంగానే ఉంటాయి. ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. తిరిగి వ్యాధి బారిన పడితే ఇమ్యూనిటీ శాతం కూడా తగ్గిపోతుంది’ అని పేర్కొన్నారు. కొద్దివారాలపాటు వ్యాధికి దూరంగా ఉండాలన్నా.. ఇలాంటి వేవ్‌లు మళ్లీ పుట్టుకురాకుండా ఉండాలన్నా బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిందేనని సూచించారు.

ఇదిలా ఉంటే.. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్‌ ఎన్నిగంటల పాటు పర్యావరణంలో జీవించి ఉంటుందనే అంశంపై జపాన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ.. అదే ప్లాస్టిక్‌ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్‌ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేనని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని