Bilawal Bhutto: నన్ను గాడిదలా తయారు చేశారు : పాక్‌ మంత్రి భుట్టో

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో తానను తాను గాడిదలా అభివర్ణించుకున్నారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ.. విదేశ పర్యటనలు చేస్తున్నారని వచ్చిన విమర్శలపై స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.

Updated : 23 Dec 2022 17:07 IST

దిల్లీ: ఐరాసలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాకిస్థాన్‌ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto) ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన విదేశీ పర్యటనలపై స్వదేశంలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఆయన.. తానను తాను గాడిదలా అభివర్ణించుకున్నారు. సొంత ఖర్చుతోనే విదేశీ ప్రయాణాలు చేస్తున్నానని, తన విదేశాంగ శాఖ తనతో గాడిదలా పనిచేయించుకుంటోందని వ్యాఖ్యానించారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. పాక్‌ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కొంత కాలంగా పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో (Pakistan Crisis) కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి సమయంలో బిలావల్‌ భుట్టో విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ వచ్చిన విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘సొంతగా ప్రయాణ టికెట్లు, హోటల్‌ బిల్లులు చెల్లించే ఏకైక విదేశాంగ మంత్రి నేనే కావచ్చు. తమ దేశం, ప్రజలపై ఎటువంటి భారాన్ని వేయడం లేదు. ఒకవేళ ఖర్చులు పెట్టినా.. విదేశాంగ మంత్రిగా ఈ పర్యటన నా ప్రయోజనం కోసం కాదు. పాకిస్థాన్‌కు లబ్ధి చేకూర్చేందుకే. చాలా శ్రమిస్తున్నా. ఇతరులు మాత్రం సరదా పర్యటన కోసం విదేశాలకు వెళ్తారు. వీళ్లు మాత్రం (తన మంత్రిత్వ శాఖను ఉద్దేశిస్తూ) నన్ను గాడిదలా పనిచేసేలా చేశారు’ అని వివరించారు.

భుట్టో అరెస్టయ్యారంటూ వార్తలు..

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto) అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన న్యూయార్క్‌లో అరెస్టయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జెరా బలోచ్‌ ఆ ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ అబద్ధాలని, వాస్తవ విరుద్ధాలని స్పష్టం చేశారు. అధికారిక పర్యటనలో భాగంగానే ఆయన అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. మరోవైపు ఐరాస సెక్రటరీ జనరల్‌తో ఇప్పటికే భేటీ అయిన భుట్టో.. తమ దేశానికి సాయం చేయాలంటూ అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని