Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటిపైకి 10 వేలమంది పోలీసులు!

ఓ అవినీతి కేసులో విచారణకుగానూ పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌కు పయనమయ్యారు. మరోవైపు.. దాదాపు 10 వేల మంది పోలీసులు లాహోర్‌లోని ఆయన ఇంటిపైకి వెళ్లారు.

Published : 18 Mar 2023 18:49 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) నివాసంలోకి ఎట్టకేలకు పోలీసులు ప్రవేశించారు. తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకుగానూ ఇమ్రాన్‌ శనివారం లాహోర్‌ (Lahore) నుంచి ఇస్లామాబాద్‌(Islamabad)కు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఇటు దాదాపు 10 వేల మంది పోలీసులు లాహోర్‌ జమాన్‌ పార్క్‌(Zaman Pakr)లోని ఆయన ఇంటిపైకి వెళ్లారు. ఇమ్రాన్‌ మద్దతుదారుల క్యాంపులను, బారికేడ్లను తొలగించారు. కార్యకర్తలను చెదరగొట్టి.. పదుల సంఖ్యలో అరెస్టులు చేశారు. ఇరుపక్షాల మధ్య తోపులాటలో పలువురు పోలీసులు, పీటీఐ శ్రేణులకు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ‘పీటీఐ(PTI)’ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ‘జమాన్ పార్క్‌లో దారుణమైన హింస సాగుతోంది. ఏదైనా జరిగితే.. మళ్లీ దాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తారా?’ అని ప్రశ్నించింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇంట్లో బుష్రా బేగం ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో నివాసంపై పంజాబ్ పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఏ చట్టం ప్రకారం ఇలా చేస్తున్నారు? ఇదంతా.. పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు లండన్ ప్లాన్‌లోని భాగమే’ అని ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. ఇదిలా ఉండగా.. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తుండగా.. ఆయన మద్దతుదారులు అడ్డుకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఘర్షణ తలెత్తింది. అయితే, జమాన్ పార్క్ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకే తాజా పోలీసు ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక మంత్రి అమీర్ మీర్ మీడియాతో చెప్పారు. ‘‘ఇమ్రాన్‌ నివాసంలో సోదాలు నిర్వహించాలని యాంటీ టెర్రరిజం కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకే పోలీసులు ఆయన ఇంట్లోకి ప్రవేశించారు" అని తెలిపారు.

అంతకుముందు లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ బయల్దేరిన ఇమ్రాన్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ కారు బోల్తాపడింది. అయితే, ఇమ్రాన్‌ వాహనానికి మాత్రం ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. మరోవైపు.. ఇమ్రాన్‌ ఖాన్‌ కోర్టుకు రానున్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని