Bed Bugs: పారిస్‌లో నరకం చూపిస్తున్న నల్లులు..!

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ను నల్లులు పట్టిపీడిస్తున్నాయి. నల్లుల విషయంలో స్థానికంగా ఎవరూ సురక్షితంగా లేరని నగర ఉప మేయర్ ఇమాన్యుయేల్ గ్రెగోయిర్ చెప్పారు.

Updated : 30 Sep 2023 16:36 IST

పారిస్‌: ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌.. నల్లుల (Bed Bugs) బెడదతో సతమతమవుతోంది. ముఖ్యంగా రాజధాని పారిస్‌ (Paris)లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రజారవాణా సాధనాలు, సినిమా హాళ్లు ఇలా నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవి విస్తృతంగా వ్యాప్తి చెందాయి. నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్‌ ఉపమేయర్‌ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వచ్చే ఏడాది ఒలింపిక్‌ క్రీడల (Paris Olympics) నిర్వహణకు పారిస్‌ సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. ఈ పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చింది.

పారిస్‌లో ఇటీవలి కాలంలో నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మెట్రోలు, బస్సులు, రైళ్లు, సినిమా థియేటర్లు ఇలా అనేక చోట్ల ఇవి ప్రజలకు నరకం చూపుతున్నాయి. దీనికి సంబంధించిన అనేక పోస్టులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే నల్లి పురుగుల కట్టడికిగానూ వచ్చే వారం ప్రజారవాణా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్‌ రవాణాశాఖ మంత్రి క్లెమెంట్ బ్యూన్ తెలిపారు. మరోవైపు.. నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ ఉప మేయర్ ఇమాన్యుయేల్ గ్రెగోయిర్ చెప్పారు. రోజూ 36 లక్షల మంది ప్రజలు పారిస్‌కు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ క్రమంలోనే నల్లుల ఉద్ధృతి పెరుగుతోందన్నారు.

ఆధారాలుంటే చూపించండి: కెనడాను కడిగేసిన జైశంకర్‌

ఇదిలా ఉండగా.. మూడేళ్ల క్రితమే ఫ్రాన్స్‌ ప్రభుత్వం నల్లులపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌, అత్యవసర నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. అనేక ప్రణాళికలు అమలు చేసింది. అయితే, ‘కీటక నాశని’లను సైతం తట్టుకుంటుండటంతో నల్లుల బెడద తీవ్రంగా మారినట్లు సంబంధిత నిపుణులు వెల్లడించారు. అయితే, ఈ సమస్యతో ఒలింపిక్ క్రీడలకు ఎటువంటి ముప్పు లేదని ఉప మేయర్‌ గ్రెగోయిర్ చెప్పారు. ‘నల్లులు.. ఇంతకు ముందు ఉన్నాయి. తర్వాత కూడా ఉంటాయి. అయితే, వాటి నివారణకు అందరూ కలిసి పనిచేయడానికి ఒలింపిక్స్‌ ఒక అవకాశం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని