France: ఉత్కంఠకు తెర..! ఎట్టకేలకు బయల్దేరిన ‘భారతీయుల’ విమానం

భారతీయులతో కూడిన విమానం ఎట్టకేలకు ఫ్రాన్స్‌నుంచి బయల్దేరింది. మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్‌ అధికారులు ఈ విమానాన్ని అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే.

Published : 25 Dec 2023 22:10 IST

పారిస్‌: ఫ్రెంచ్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్న భారతీయ ప్రయాణికులున్న విమానం ఎట్టకేలకు పారిస్‌ (Paris) నుంచి బయలుదేరింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ విమానం దుబాయి నుంచి పారిస్‌ మీదుగా నికరాగువాకు చేరుకోవాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం దీన్ని భారత్‌కు మళ్లించారు. సోమవారం ఉదయమే ఈ విమానం టేకాఫ్‌ తీసుకోవాల్సి ఉండగా.. కొంతమంది ప్రయాణికులు భారత్‌కు వచ్చేందుకు నిరాకరించడంతో కాసేపు గందరగోళం తలెత్తినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

303 మంది భారతీయులు గురువారం రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో దుబాయి నుంచి నికరాగువాకు వెళ్తూ.. మార్గమధ్యంలో ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇంధనం కోసం పారిస్‌ సమీపంలోని వాట్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు.. మానవ అక్రమ రవాణా అనుమానంతో స్థానిక అధికారులు ఆ విమానాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించి.. స్థానిక అధికారులతో చర్చించింది. ఆదివారం న్యాయమూర్తులు విచారణ జరిపారు. అంతలోనే విమానం బయలుదేరేందుకు అనుమతులు వచ్చాయి.

భారతీయుల విమానానికి లైన్‌క్లియర్‌

ప్రయాణికుల్లో 11 మంది ఏ తోడులేని మైనర్లు ఉన్నారు. మరోవైపు కొంతమంది ఫ్రాన్స్‌లోనే ఆశ్రయం పొందేందుకు అభ్యర్థించారు. దీంతోపాటు ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉండిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్‌కు బయల్దేరిన ఈ విమానంలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. మంగళవారం తెల్లవారుజామున ముంబయి విమానాశ్రయానికి ఇది చేరుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు