Sri Lanka Crisis: శ్రీలంక తదుపరి ప్రధాని రణిల్‌ విక్రమసింఘే..!

రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు.. కొత్త ప్రధాని రాబోతున్నట్లు తెలుస్తోంది. యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నేత రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

Updated : 12 May 2022 16:52 IST

పేరు ప్రకటించనున్న అధ్యక్షుడు

కొలంబో: రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు.. కొత్త ప్రధాని రాబోతున్నట్లు తెలుస్తోంది. యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నేత రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.  శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఈ యూఎన్‌పీ నేతకు మధ్య సమావేశం జరిగినప్పటి నుంచి ఈ వార్తలు వస్తున్నాయి. కొత్తగా రాబోయే ప్రధాని ఈ రోజే పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. 

ఇదిలా ఉండగా.. లంకలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా గొటబాయ రాజపక్స ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తన అధికారాలను తగ్గించుకునేందుకు ముందుకు వచ్చిన ఆయన.. పదవి నుంచి దిగిపోవడానికి మాత్రం అంగీకరించడం లేదు. ఆయన దిగిపోవాలంటూ నెలరోజులుగా నిరసన జరుగుతుండగా.. ఈ వ్యవధిలో మొదటి సారి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని లంకేయులకు పిలుపునిచ్చారు. విద్రోహ ప్రయత్నాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రధాని, ప్రభుత్వం వచ్చాక.. పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పించేలా రాజ్యాంగ సంస్కరణలు చేపడతామన్నారు. యువ కేబినెట్‌ను ఏర్పాటుచేస్తానని, అందులో తమ కుటుంబ సభ్యులెవరూ ఉండబోరని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మెజార్టీ, ప్రజల విశ్వాసం పొందిన కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. విక్రమసింఘేకు పలు దఫాలుగా ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది. 

దేశంలో నెలకొన్న తీవ్ర ఘర్షణల నడుమ మహీంద రాజపక్స ప్రధాని పీఠం దిగిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అత్యంత భద్రత నడుమ నౌకాదళ స్థావరంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మహీంద, ఆయన కుమారుడు నమల్‌ రాజపక్స, మరో 15 మందికి శ్రీలంక కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వారు విదేశాలకు వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని