Suella Braverman: బ్రేవర్మన్‌.. అవకాశాలతోపాటే వెంటాడిన వివాదాలు!

ఉద్వాసనకు గురైన బ్రిటన్‌ విదేశాంగ మంత్రి సుయేలా బ్రేవర్మన్‌ను మొదటి నుంచి వివాదాలు వెంటాడాయి.

Published : 13 Nov 2023 18:19 IST

లండన్‌: బ్రిటన్‌ హోంశాఖ మంత్రి, భారత సంతతి సుయేలా బ్రేవర్మన్‌ (Suella Braverman)పై ప్రధాన మంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) వేటు వేసిన విషయం తెలిసిందే. లండన్‌లో పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శించడం తదితర పరిణామాలు ఆమె తొలగింపునకు కారణమయ్యాయి. అయితే, బ్రేవర్మన్‌ మొదటినుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రిషి సునాక్‌ ఆమెను మంత్రివర్గంలో తీసుకోవడంపై సొంత పార్టీ ‘కన్జర్వేటివ్‌’తోపాటు ప్రతిపక్షాల నుంచీ వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ.. నేరస్థులపై ఉక్కుపాదం మోపడంతోపాటు దేశ సరిహద్దులను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తారంటూ సునాక్‌ ఆమెకు అవకాశం ఇచ్చారు. చివరకు అదే వివాదాస్పద వైఖరి కారణంగా ఆమె తన పదవి పోగొట్టుకున్నారు.

భారత్‌తో ఒప్పందంపై ఆందోళన..

బ్రిటన్‌ విధాన నిర్ణయాలు, ముఖ్యంగా వలస విధానంలో బ్రేవర్మన్‌ తీసుకున్న నిర్ణయాలు, వెల్లడించిన అభిప్రాయాలు విమర్శలకు దారితీశాయి. వీసా కాలపరిమితి ముగిసినా.. చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్‌లోనే ఉండిపోతున్నారంటూ బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. బ్రిటన్‌లో వీసా కాలపరిమితి మించి ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులని పేర్కొనడం చిక్కుల్లో పడేసింది. భారత్‌తో ఓపెన్‌ బార్డర్‌ మైగ్రేషన్‌ పాలసీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఈ ఒప్పందం వల్ల పెద్ద ప్రయోజనం లేదని విమర్శించారు. అయితే, భారత్‌ తీవ్రంగా స్పందించడంతో బ్రిటన్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరో సమయంలో.. తమ దేశానికి అక్రమంగా వలస వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రువాండాకు తరలించడం తన కల అని పేర్కొనడం గమనార్హం.

రిషి సునాక్‌ కీలక నిర్ణయం: సుయెల్లా బ్రేవర్మన్‌పై వేటు

బ్రిటన్‌లో ఆశ్రయంతోపాటు ప్రత్యేక ప్రయోజనాలు పొందేందుకు కొంతమంది స్వలింగ సంపర్కుల్లా నటిస్తున్నారంటూ గత సెప్టెంబరులో బ్రేవర్మన్‌ వ్యాఖ్యానించారు. స్థానిక యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వారిలో అధికులు బ్రిటిష్‌- పాకిస్థానీయులేనని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. బ్రిటన్‌ వీధులను ఆక్రమించి నివసిస్తున్నవారిలో చాలా మంది విదేశాల నుంచి వచ్చినవారేనని, తమ జీవనశైలిలో భాగంగానే వారు ఇలా ఉంటున్నారని పేర్కొన్నారు. బ్రిటన్‌ దక్షిణ తీరంలో శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివర్ణించడం దుమారం రేపింది. లండన్‌ వెలుపల అతి వేగంగా కారును నడిపినందుకు వేసిన ఫైన్‌, పాయింట్లను దాచిపెట్టేందుకు ప్రయత్నించారని ఆమెపై విమర్శలొచ్చాయి.

ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత..

మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా పనిసిన బ్రేవర్మన్‌.. ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘిస్తున్నారంటూ ట్రస్‌పై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే వృత్తిపర తప్పిదాలతో రాజీనామా చేశారు. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడి రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి అదే పదవిలో ఎలా నియమిస్తారంటూ రిషి సునాక్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే.. చేసిన తప్పులను అంగీకరించినందునే తిరిగి అదే పదవిలో నియమించామంటూ రిషి సునాక్‌ అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీపై చేసిన వ్యాఖ్యలు పదవి కోల్పోవడానికి కారణమయ్యాయి. థెరెసా మే, బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వాల్లోనూ బ్రేవర్మన్‌ ఆయా బాధ్యతలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని