Urine: మూత్రం పసుపు పచ్చగా ఉండటానికి కారణం ఇదే!

మూత్రం పసుపచ్చరంగులో ఉండటానికి గల కారణాన్ని మేరీల్యాండ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు గుర్తించారు.

Published : 05 Jan 2024 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మూత్రం (Urine) పసుపు పచ్చరంగులో ఎందుకు ఉంటుంది?’ ఈ ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. ఒంట్లో నీటి స్థాయి తక్కువైనా, వేడి చేసినా ఆ రంగులో వస్తుందని చెబుతుంటారు తప్ప.. కచ్చితమైన కారణం చెప్పలేరు. కానీ, మేరీల్యాండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మూత్రం పసుపుపచ్చ రంగులో ఉండటానికి కారణమేంటో గుర్తించారు. దీనిపై నేచర్‌ మైక్రోబయాలజీ జర్నల్‌లో కథనం కూడా ప్రచురితమైంది. సాధారణంగా మూత్రంలో నీరు, ఎలక్ట్రోలైట్లు, మూత్రపిండాలు వడబోసిన రక్తంలోని వ్యర్థాలు ఉంటాయి. ఇది పసుపుపచ్చ రంగులో ఉండటానికి యూరోబిలిన్‌ అనే ఎంజైమ్‌ కారణమని దాదాపు 125 ఏళ్ల క్రితమే వైద్య నిపుణులు గుర్తించారు. కానీ, ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుందన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు.

కానీ, మూత్రం రంగుకు, ఎర్ర రక్తకణాలకు సంబంధముందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమైన తర్వాత బిలిరుబిన్‌ అనే నారింజ రంగు వర్ణ ద్రవాన్ని విడుదల చేస్తాయి. దీన్నే బిలిరుబిన్‌ అంటారు. ఇది జీర్ణాశయంలోకి చేరుకున్న తర్వాత ఉపయోగకరమైన బాక్టీరియా దీనిని వివిధ అణువులుగా మార్చుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలోనే యూరోబిలినోజెన్‌ అనే రంగులేని ఉప ఉత్పత్తి తయారవుతుంది. అది క్రమంగా పసుపు పచ్చ రంగులో ఉండే యూరోబిలిన్‌గా మారి మూత్రం ద్వారా బయటకు వస్తుందని వెల్లడించింది. తాజా అధ్యయనంతో జీర్ణాశయ వ్యాధులకు సంబంధించిన మరిన్ని అంశాలపై స్టడీ చేసేందుకు అవకాశం కలిగిందని పరిశోధనకు నాయకత్వం వహించిన బ్రెంట్‌లే హాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని