Ukraine: స్టార్‌లింక్‌ను వాడుకోవడానికి ఉక్రెయిన్‌ సేనలను అనుమతించలేదు: స్పేస్‌ఎక్స్‌

Ukraine: కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌ వంటి అత్యవసర సేవల కోసం స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌ను ఎలాన్‌ మస్క్‌ ఉక్రెయిన్‌కు అందించారు. అయితే, దాన్ని సైనిక అవసరాలకు వాడుకోవడానికి అనుమతించలేదని తాజాగా స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది.

Published : 10 Feb 2023 23:31 IST

వాషింగ్టన్‌: రష్యా (Russia) దాడులతో ఉక్రెయిన్‌ (Ukraine)లో కమ్యూనికేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇది ఆసుపత్రులు, బ్యాంకింగ్‌ వంటి అత్యవసర సేవలకు అడ్డంకిగా మారింది. దీనికి పరిష్కారంగా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ ఎక్స్‌ అక్కడ స్టార్‌ లింక్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. అంటే తక్కువ ఎత్తులో ఉండే ఉపగ్రహాల నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని పొందేలా ఏర్పాట్లు చేసింది.

ఈ స్టార్‌లింక్‌ సేవల్ని కేవలం అత్యవసర సేవల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్నది కంపెనీ నియమం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సైనిక అవసరాలకు వినియోగించుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ, ఉక్రెయిన్‌ సేనలు స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌ను రష్యాపై దాడులకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా చేయడానికి తాము అంగీకరించలేదని స్పేస్‌ఎక్స్‌ అధ్యక్షుడు గ్విన్‌ షాట్‌వెల్‌ తాజాగా వెల్లడించారు. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ సాంకేతికతను ఉక్రెయిన్‌ సేనలు వినియోగించుకోకుండా తాము తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ను సైనికల అవసరాలకు వాడుకోవడానికి ఎలాన్‌ మస్క్‌ అంగీకరించడం లేదంటూ గతకొంత కాలంగా వినిపిస్తోంది. షాట్‌వెల్‌ ప్రకటనతో తాజాగా అది నిరూపితమైంది. ఆయుధంగా వాడుకోవడానికి స్టార్‌లింక్‌ను రూపొందించలేదని షాట్‌వెల్‌ స్పష్టం చేశారు. కమ్యూనికేషన్‌ అవసరాలకు వాడుకునేందుకు మిలిటరీని ఒక దశ వరకు అనుమతించాల్సి వచ్చిందని తెలిపారు. కానీ, దాడుల కోసం వినియోగించడం మాత్రం కుదరదని తేల్చి చెప్పారు.

ఉక్రెయిన్‌ సేనలు పలు సందర్భాల్లో స్టార్‌లింక్‌ సాంకేతికతను ప్రశంసించాయి. కమ్యూనికేషన్లను కొనసాగించడంతో పాటు డ్రోన్లు, ఆయుధాలతో రష్యన్‌ సేనలను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ కీలక సాంకేతికత తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని బహిరంగంగానే ప్రకటించాయి. ఆ తర్వాత స్పేస్‌ఎక్స్‌ ఈ విషయాన్ని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తమ సేవలకు చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. కానీ, మస్క్‌ ఈ వార్తల్ని వెంటనే ఖండించారు. ఉక్రెయిన్‌కు ఉచితంగానే స్టార్‌లింక్‌ సేవల్ని అందిస్తున్నామని తెలిపారు. అయితే, తాజాగా షాట్‌వెల్‌ మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. కీలకమైన ఈ స్టార్‌లింక్‌ ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చాలని తాను మాత్రమే పెంటగాన్‌ను కోరినట్లు తెలిపారు. దీంతో మస్క్‌కు సంబంధం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని