Sri Lanka Crisis: 7 రోజుల్లో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు..!

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ ఎట్టకేలకు తన పదవి నుంచి దిగిపోయారు. సింగపూర్‌ నుంచి ఈమెయిల్‌ ద్వారా

Published : 15 Jul 2022 10:39 IST

గొటబాయ రాజీనామాను అంగీకరించిన స్పీకర్‌

కొలంబో: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ ఎట్టకేలకు తన పదవి నుంచి దిగిపోయారు. సింగపూర్‌ నుంచి ఈమెయిల్‌ ద్వారా రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్‌ మహింద అభయ్‌వర్ధన్‌కు పంపించారు. గొటబాయ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

వారం రోజుల్లోగా తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటిదాకా ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్లమెంట్‌ శనివారం సమావేశం కానుందని స్పీకర్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎంపీలంతా పాల్గొనేలా శాంతియుత వాతావరణం కల్పించాలని ఆందోళనకారులను కోరారు.

2.2 కోట్ల జనాభా గల శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గత 7 దశాబ్దాల్లోనే ఎన్నడూ లేని విధంగా నిత్యావసరాలు, అత్యవసరాల కొరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి రాజపక్స కుటుంబమే కారణమని, వారు వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స దిగిపోగా.. రణిల్‌ విక్రమసింఘె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నిరసనలు మిన్నంటడంతో అధ్యక్షుడు గొటబాయ కూడా పదవి నుంచి వైదొలిగేందుకు అంగీకరించారు. అయితే తనను దేశం నుంచి వెళ్లనిస్తేనే రాజీనామా చేస్తానని చెప్పడం గమనార్హం.

అలా ఇటీవల మాల్దీవులు వెళ్లిన గొటబాయ.. అక్కడి నుంచి నిన్న దుబాయి ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్‌ వెళ్లారు. అక్కడి నుంచే తన రాజీనామా లేఖను ఈమెయిల్‌ ద్వారా పంపారు. అయితే ఆయన శ్రీలంక అధ్యక్షుడి హోదాలో ప్రైవేటు పర్యటన నిమిత్తం తమ దేశానికి వచ్చినట్లు తెలిపారని, అందువల్లే అనుమతించామని సింగపూర్‌ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, గొటబాయ రాజీనామాతో ఆందోళనలకారులు కాస్త శాంతించారు. ఏప్రిల్‌ 9 నుంచి వారు తిష్ఠ వేసిన అధ్యక్షుడి నివాసం, ప్రధాని కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని