Srilanka Crisis: దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

ద్వీప దేశం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా..

Updated : 13 Jul 2022 08:19 IST

కొలంబో: ద్వీప దేశం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారైనట్లు వైమానిక అధికారి వెల్లడించారు. కాగా అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో తనను దేశం వీడి పోయేందుకు అనుమతిస్తేనే.. పదవి నుంచి వైదొలగుతానని మంగళవారం ఆయన మాట మార్చిన విషయం తెలిసిందే.

తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో.. అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 13న వైదొలగుతానని గొటబాయ ఇదివరకే పార్లమెంటు స్పీకర్‌కు, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌ మహింద అభయ్‌వర్ధనకు రాజీనామా లేఖను కూడా అందించినట్లు సమాచారం. అయితే, గొటబాయ కొత్త షరతు నేపథ్యంలో ఆయన రాజీనామా విషయమై స్పీకర్‌ ప్రకటన చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాల సన్నాహాలు..

అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉన్నందున శ్రీలంకలో  అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలైన ఎస్‌జేబీ, ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్‌ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆయనకు మద్దతను కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా పార్లమెంటు సభ్యులు తమలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని