TikTok: అవును.. టిక్‌టాక్‌ ద్వారా కొందరి డేటాను ట్రాక్‌ చేశారు: బైట్‌డ్యాన్స్‌

టిక్‌టాక్‌(TikTok)లో యూజర్ల డేటా భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా కొందరి డేటాను తమ ఉద్యోగులు ట్రాక్‌ చేసినట్లు టిక్‌టాక్‌ అంగీకరించింది.  

Published : 24 Dec 2022 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వీడియో షేరింగ్‌ దిగ్గజం టిక్‌టాక్‌(TikTok) ద్వారా వినియోగదారుల డేటాను ట్రాక్‌ చేయొచ్చనే భయాలు నిజమయ్యాయి. టిక్‌టాక్‌(TikTok) ద్వారా కొందరు జర్నలిస్టుల డేటాను తాము ట్రాక్‌ చేశామని దాని మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ అంగీకరించిందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. టిక్‌టాక్‌ (TikTok) నుంచి కీలక సమాచారం లీక్‌పై అంతర్గత దర్యాప్తు చేపట్టినప్పుడు ఇలా చేసినట్లు బైట్‌డ్యాన్స్‌ తెలిపింది. తమ కంపెనీలోని కొందరు ఉద్యోగులు ఇద్దరు జర్నలిస్టుల డేటాను యాక్సెస్‌ చేశారని వెల్లడించింది. ఈ జర్నలిస్టుల్లో టైమ్స్‌ రిపోర్టర్‌, బజ్‌ఫీడ్‌ జర్నలిస్టు ఉన్నట్లు పేర్కొంది. తమ కంపెనీలోని ఉద్యోగులతో వీరికి సంబంధాలు ఉన్నాయని నమ్మడంతో.. వాటిని కనుగొనేందుకు ఇలా చేసినట్లు చెప్పింది. ఈ ఇద్దరు జర్నలిస్టులు తమ కంపెనీలో లీక్‌ అయిన కంటెంట్‌పై కథనాలు రాసినట్లు వివరించింది. వాస్తవానికి ఈ దర్యాప్తులో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపింది.

ఈ క్రమంలో సదరు జర్నలిస్టుల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారి లొకేషన్‌ తెలుసుకొనేందుకు బైట్‌డ్యాన్స్‌ ఉద్యోగులు యత్నించారు. దీంతో సదరు జర్నలిస్టుల లొకేషన్‌, అనుమానిత ఉద్యోగుల లొకేషన్‌ ఒకే చోట ఉందేమో సరిపోల్చాలని భావించారు. కానీ, ఐపీ అడ్రస్‌ కచ్చితమైన లొకేషన్‌ తెలియజేయదు. దీంతో వీరి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ జర్నలిస్టుల డేటాను కంపెనీ పాలసీలకు విరుద్ధంగా యాక్సెస్‌ చేసిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ లాయర్‌ ఎరిక్‌ అండర్సన్‌ వివరించారు. ఈ కంపెనీ తొలగించిన ఉద్యోగుల్లో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్‌ డేటాను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకొంటామని సంస్థ పేర్కొంది. 

తాజా ఘటనతో అమెరికా(USA)లో టిక్‌టాక్‌(TikTok)పై నిషేధం ముప్పు మరింత పెరిగిపోయింది. ఇప్పటికే ఆ దేశ కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు ఈ దిశగా బైడెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై నిషేధం విధించేందుకు ఇప్పటికే అమెరికా(USA) చట్టసభలో రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా (USA) వాసులపై నిఘా కోసం చైనా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చేమోనన్న ఆందోళనను ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. ఈ బిల్లు ప్రకారం రష్యా, చైనాల ప్రభావం ఉన్న ఏ సోషల్‌ మీడియా కంపెనీనైనా బ్లాక్‌ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు