Rishi Sunak: భారత్‌తో ఒప్పందం కుదిరినా.. మా నిర్ణయం మారదు: బ్రిటన్‌

ఒకవేళ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరినా వలసలను అరికట్టే విషయంలో తమ వ్యూహాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని బ్రిటన్‌ వెల్లడించింది.

Published : 07 Sep 2023 23:23 IST

లండన్‌: తమ దేశానికి ప్రయోజనం చేకూరినప్పుడే భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తామని చెప్పిన బ్రిటన్‌ (Britain) తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ భారత్‌ (India)తో ఒప్పందం ఖరారైనప్పటికీ.. వలసల విషయంలో తమ వ్యూహాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తరఫు అధికార ప్రతినిధి వెల్లడించారు. దిల్లీ వేదికగా జరగనున్న జీ20 (G20) సదస్సుకు సునాక్‌ బయల్దేరడానికి ఒక్క రోజు ముందుగా బ్రిటన్‌ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటన్‌కు వలసవెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వారిని అరికట్టేందుకు బ్రిటన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. చివరికి విద్యార్థి వీసాల అంశంలోనూ ఆంక్షలు విధించింది.

‘‘ప్రస్తుతం దేశంలో వలసవచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రధాని రిషి సునాక్‌ భావిస్తున్నారు. అందువల్ల మైగ్రేషన్‌ విధానాన్ని మార్చుకునే అవకాశం లేదు. ఒకవేళ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినా ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని సునాక్‌ తరఫున అధికార ప్రతినిధి అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత్‌, బ్రిటన్‌ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరుదేశాల అధికారులు, నేతలు ఇప్పటివరకు 12 విడతలుగా చర్చలు జరిపారు. చివరిసారిగా ఆగస్టు 8 నుంచి 31 మధ్య చర్చలు నిర్వహించారు. ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ, రిషి సునాక్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూకే-ఇండియా వాణిజ్య ఒప్పందం పురోగతిపై చర్చించారు. ఆ తర్వాతి నుంచి చర్చలు వేగవంతమయ్యాయి. పరస్పర ప్రయోజనం కలిగేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని