Ukraine : ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై మండిపడ్డ ఉక్రెయిన్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మేక్రాన్‌పై ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి మండిపడ్డారు. అంతకు ముందు మేక్రాన్‌ మాట్లాడుతూ పశ్చిమ దేశాలకు మాస్కోకు మధ్య దౌత్య సంబంధాలను పెంపొందించేందుకు రష్యాను

Published : 05 Jun 2022 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మేక్రాన్‌పై ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి మండిపడ్డారు. అంతకు ముందు మేక్రాన్‌ మాట్లాడుతూ పశ్చిమ దేశాలకు మాస్కోకు మధ్య దౌత్య సంబంధాలను పెంపొందించేందుకు రష్యాను యుద్ధం విషయంలో అవమానించకపోవడం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఇటీవల వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌ను ఆక్రమించి చారిత్రక మౌలిక తప్పిదం చేసినట్లు చెప్పాను. రష్యాను అవమానించవద్దు. అప్పుడే యుద్ధం ఆపిన రోజు దౌత్య మార్గంలో పరిష్కారానికి  ప్రయత్నించవచ్చు. ఈ వివాదంలో ఫ్రాన్స్‌ బలమైన మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. ఈ వివాదం విస్తృతమైన యుద్ధంగా మారకుండా నేను నా శక్తి వెచ్చించి కృషి చేస్తున్నాను. డిసెంబర్‌ నుంచి ఎన్నిసార్లు మాట్లాడానో నాకే గుర్తులేదు. దాదాపు 100 గంటలు మాట్లాడి ఉంటాను. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకే ఇది చేశాను ’ అని మేక్రాన్‌ అన్నారు. ఆయన ప్రాంతీయ పత్రికలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మేక్రాన్‌ వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా మండిపడ్డారు. రష్యాను దాని హద్దులో ఉంచడంపై మరింత దృష్టిపెట్టడం మంచిదని వ్యాఖ్యానించారు. ‘‘రష్యాను అవమానించొద్దు అని పిలుపునివ్వడం అంటే.. ఫ్రాన్స్‌ దానిని అది అవమానించుకొన్నట్లే. అంతేకాదు.. ఇటువంటి పిలుపు ఇచ్చేవారిని అవమానించినట్లు’’ అని పేర్కొన్నారు. 

అమెరికా, యూకేలకు భిన్నంగా ఫ్రాన్స్‌ ఇప్పటికే పలు మార్లు దౌత్యమార్గాల్లో పరిష్కారం వెతికేందుకు క్రెమ్లిన్‌తో చర్చలు జరిపింది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి కూడా మేక్రాన్‌ వాదనకు మద్దతు ఇస్తున్నారు. ఐరోపా నమ్మకమైన దౌత్యాన్ని కోరుకొంటోందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని