Ukraine Crisis: ఉక్రెయిన్‌లో 112 చిన్నారుల మృతి.. ఐరాస ఆందోళన

రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 112 మంది చిన్నారులు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం......

Published : 20 Mar 2022 01:42 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై పట్టు సాధించేందుకు పుతిన్‌ సేనలు తీవ్ర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో భారీగా పౌర మరణాలు నమోదవుతోన్న విషయం తెలిసిందే. పెద్దలతోపాటు చిన్నారులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 112 మంది చిన్నారులు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తాజాగా వెల్లడించింది. మరో 140 మంది పిల్లలు గాయపడినట్లు తెలిపింది. కాగా ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని విచారం వ్యక్తం చేసింది.

జపోరిజియాలో 38 గంటల కర్ఫ్యూ..

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియా నగర శివార్లలో రష్యా తాజాగా జరిపిన దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక ఉప మేయర్‌ అనటోలీ కుర్తీవ్‌ తెలిపారు. మరో 17 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో 38 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇటీవల ఈ నగరంలోని  అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని