Ukraine crisis: అదే సమయంలో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ సంక్షోభానికి కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం పునరుద్ఘాటించారు. చర్చల విషయంలో ఇరు దేశాల ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో ఆయన ఓ టీవీ ఛానెల్‌తో ఈ మేరకు వ్యాఖ్యానించారు...

Published : 21 May 2022 19:35 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ సంక్షోభానికి కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం పునరుద్ఘాటించారు. చర్చల విషయంలో ఇరు దేశాల ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో ఆయన ఓ టీవీ ఛానెల్‌తో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘పోరు కొనసాగుతోంది. యుద్ధం రక్తమయమవుతోంది. కానీ, చివరకు దౌత్యం ద్వారానే దీనికి తెరపడుతుంది. ఇరు దేశాల మధ్య నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి. మధ్యవర్తులు ఉంటారా? వారు లేకుండానేనా? అధ్యక్ష స్థాయిలోనా?.. ఏ ఫార్మాట్‌లో జరుగుతాయో తెలియదు. కానీ.. కొన్ని విషయాలను చర్చల ద్వారానే చేరవేయగలం. మేం ప్రతిదీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాం. కానీ.. రష్యా అలా భావించడం లేదు’ అని ఆరోపించారు.

చర్చల ఫలితాలు ఉక్రెయిన్‌కు న్యాయం చేకూర్చేలా ఉండాలని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తమ దేశానికి భద్రతా హామీలు అందించే పత్రంపై ఉక్రెయిన్ భాగస్వాములు, మిత్రదేశాలు సంతకం చేస్తాయని చెప్పారు. అదే సమయంలో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని తెలిపారు. మేరియుపోల్‌ అజోవ్‌స్తల్ స్టీల్‌ వర్క్స్‌లో లొంగిపోయిన ఉక్రెయిన్‌ సిబ్బందిని రష్యా చంపకూడదన్న ముందస్తు షరతుతోనే చర్చలకు ముందుకొస్తామన్నారు. మాస్కోతో చర్చలు నిలిచిపోయాయని ఇటీవల కీవ్‌ ప్రధాన సంధానకర్త మైఖైలో పోడోల్యాక్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. చర్చలను కొనసాగించడం కీవ్‌ అధికారులకే ఇష్టం లేదన్నారు. రష్యా వార్తాసంస్థల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య చివరిసారి చర్చలు ఏప్రిల్ 22న జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని