Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన

గాజా జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐరాస(UN) ఆందోళన వ్యక్తం చేసింది. 

Published : 19 Mar 2024 18:41 IST

జెనీవా: యుద్ధంతో ఛిద్రమవుతోన్న గాజాలో మానవతాసాయం అందించేలా చూసేందుకు ఇజ్రాయెల్ ఆంక్షలు అడ్డంకిగా మారాయని ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఆకలి మంటల్ని ఆ దేశం యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యలు చేసింది. అదే గనుక నిజమైతే యుద్ధ నేరం కింద పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.(Israel Hamas Conflict)

అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన ఉగ్ర దాడితో గాజాలో ఇజ్రాయెల్‌ ప్రతిదాడులు మొదలుపెట్టింది. అప్పటినుంచి ఆ ప్రాంతం పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఇక్కడి జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తాజాగా అంచనా వేసింది. స్థానికంగా ప్రతిఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇజ్రాయెల్‌ తన దాడులను రఫాకు విస్తరిస్తే.. మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని హెచ్చరించింది.

హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌ దాడిలో టాప్‌ కమాండర్‌ హతం

నెల రోజుల తర్వాత మాట్లాడుకున్న బైడెన్‌-నెతన్యాహు

దాదాపు 1.3 మిలియన్ల మంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మరోసారి ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో,  అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘తాజా పరిణామాలపై నెతన్యాహుతో మాట్లాడాను. హమాస్‌ను అడ్డుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని పునరుద్ఘాటించాను. అలాగే బందీలను విడిపించుకునే ఒప్పందంలో భాగంగా కాల్పుల విరమణ అవసరాన్ని మరోసారి స్పష్టంచేశాను. రఫాలో గ్రౌండ్ ఆపరేషన్ లేకుండా హమాస్‌ను ఎదుర్కొనే మార్గాలపై చర్చించేందుకు ఓ బృందాన్ని వాషింగ్టన్ కు పంపాలని ఆయనకు సూచించాను’ అని బైడెన్ (Biden) సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని (Benjamin Netanyahu) అనుసరిస్తున్న తీరుపై కొద్దిరోజుల క్రితం బైడెన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బెంజమిన్‌ వైఖరి ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని వ్యాఖ్యానించారు. ఆ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే నెల రోజుల తర్వాత తాజాగా వీరిద్దరూ మాట్లాడుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని