covid19: అమెరికాలో కుప్పకూలనున్న ఆరోగ్య వ్యవస్థ..!

అమెరికాలో కరోనా వైరస్‌  (coronavirus) ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు అమెరికా భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గతేడాది జనవరి

Published : 12 Jan 2022 01:44 IST

 వైరస్‌ సోకిన వైద్య సిబ్బంది కూడా విధులకు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికాలో కరోనా వైరస్‌  (coronavirus) మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే  అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతోంది . గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.. తాజాగా సోమవారం ఒమిక్రాన్‌, ఇతర వేరియంట్లు సోకి 1,41,385 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య మంగళవారం 2021 రికార్డు స్థాయి సంఖ్యను దాటేస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

ప్రమాద ఘంటికలు..

అమెరికాలో ఒమిక్రాన్‌ ప్రభావం నిపుణుల అంచనాలకు తగ్గట్లు ఉంటే.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మరికొన్ని వారాల్లోనే  2,75,000 నుంచి 3,00,000 మధ్యలో ఉండొచ్చు. ఈ సంఖ్య జనవరి చివరి నాటికి వాస్తవరూపం ధరించొచ్చని నిపుణులు చెబుతున్నారు. సోమవారం కొలొరాడో, ఒరిగాన్‌‌,లూసియానా, మేరీల్యాండ్‌, వర్జీనియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

రోగులుగా మారుతున్న నర్సులు..

అమెరికాలో కేసుల తాకిడి బీభత్సంగా ఉండటంతో కరోనా వైరస్‌ (coronavirus) బారిన పడే ఆసుపత్రి సిబ్బంది సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా వైద్య సిబ్బంది సంఖ్య తక్కువగా.. చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అమెరికాలో1,200 ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సంఖ్య దేశంలోని 24 శాతం ఆసుపత్రులకు సమానం. ఈ విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీస్‌ ధ్రువీకరించింది. మరో 100 ఆసుపత్రుల్లో రానున్న వారం రోజుల్లో సిబ్బంది కొరత ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

కరోనా సోకినా వైద్యసేవలకు రండి..!

ఒమిక్రాన్‌ కారణంగా భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా (coronavirus) బారిన పడటంతో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కీలక నిర్ణయం తీసుకొంది. సార్స్‌కోవ్-2 పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేకపోతే.. సిబ్బంది ఎన్‌-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ తాత్కాలికంగా అమల్లో ఉంటాయని పేర్కొంది. కరోనా రోగి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వైద్యసిబ్బంది కూడా లక్షణాలు లేకపోతే ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఎన్‌-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని తెలిపింది. దీనిపై కాలిఫోర్నియా నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. ‘‘వైరస్‌ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు అసంబద్ధమైన చర్యను చేపట్టారు’’ అంటూ మండిపడ్డారు.

ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని వారిలో కరోనా వైరస్‌ (coronavirus) వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు కొత్తగా బ్రేక్‌త్రూ (వ్యాక్సిన్‌ తీసుకొన్న వారిలో) ఇన్ఫెక్షన్లు కూడా నమోదవుతున్నాయి. ఈ సారి వచ్చే కేసుల సంఖ్య ప్రకారం అతి తక్కువ శాతం ఆసుపత్రుల్లో చేరినా.. ఐసీయూ పడకలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ‘వాషింగ్టన్‌ పోస్టు’ కథనం పేర్కొంది. 2021 జనవరి 12 తేదీన అత్యధికంగా 29,534 మంది ఐసీయూల్లో చికిత్స పొందారు. ఈసారి సోమవారం నాటికి ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 23,524కు చేరింది.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..

కరోనా వైరస్‌తోపాటు.. ఈ కష్టకాలంలో ఫేక్‌న్యూస్‌ మహమ్మారి కూడా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఒమిక్రాన్‌ సహజ టీకా అంటూ భారీగా ప్రచారం జరగడం కూడా వైరస్‌ వ్యాప్తిని పెంచుతోంది. ఇటువంటి ప్రచారాలు ప్రజల్లో నిర్లక్ష్యాన్ని పెంచుతున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్లపై అర్థం లేని అనుమానాలను సృష్టించడం నష్టదాయకంగా మారుతోంది. అమెరికాలో వైరస్‌ తీవ్రతకు ప్రధాన కారణం వ్యాక్సిన్లు తీసుకోని వ్యక్తులేనని అక్కడి నిపుణులు నెత్తీనోరు బాదుకొంటున్నారు. భారత్‌లో దిల్లీ ప్రభుత్వం జనవరి 5 నుంచి 9 వరకు నమోదైన మరణాలపై నిర్వహించిన సర్వేలో కీలక విషయం తేలింది. ఈ సమయంలో మరణించిన మొత్తం 46 మందిలో 35 మంది టీకా తీసుకోని వారేనని తేలింది. అంటే టీకా తీసుకోని వారిలో 76శాతం అధిక మరణాలు నమోదవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని