US: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అమెరికా స్పందన ఇదే

ప్రధాని మోదీ(Modi)పై బీబీసీ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దీనిపై యూఎస్‌ నుంచి స్పందన వెలువడింది. 

Updated : 24 Jan 2023 11:12 IST

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీ(Modi)పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రాజేసింది. దీనిపై కేంద్రం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. తాజాగా దీనిపై అగ్రదేశం అమెరికా(US) స్పందించింది.

‘మీరు చెప్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైది. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది. అలాగే ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాల గురించి మేం ఆలోచిస్తాం. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అమెరికా, భారత్‌  ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉంది’ అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌( Ned Price) విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనిపై ఇదివరకు బ్రిటన్(Britain)ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) కూడా ఇదే తరహాలో స్పందించారు. ఆ డాక్యుమెంటరీ వివాదం నుంచి దూరం జరిగారు. అందులోని విషయాలను తాను పూర్తిగా అంగీకరించలేనని వెల్లడించారు.

2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని భారత్‌(India)తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ‘ఇది ఒక ప్రచార కార్యక్రమం. వారు ఎంచుకున్న కోణాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే దీన్ని రూపొందించారు’ అని వ్యాఖ్యానించారు.

ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదమైన నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ యూకేలో ఆన్‌లైన్‌ పిటిషన్‌ దాఖలైంది. గత వారం ప్రసారమైన మొదటి భాగంలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని, వీక్షకులను తప్పుదోవ పట్టించేలా ఉందని, నిర్దిష్ట ప్రమాణాలను పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంగళవారానికి నిర్దేశించిన రెండో భాగం ప్రసారాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని