Ukraine Crisis: రష్యావి భయానక చర్యలు.. ఐరాస వేదికగా అమెరికా మండిపాటు

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓ వైపు యుద్ధాన్ని నివారించేందుకు చర్యల ప్రయత్నాలు సాగుతుండగానే సరిహద్దుల్లో ఘర్షణ

Updated : 22 Feb 2022 11:08 IST

యునైటెడ్‌ నేషన్స్‌: రష్యా - ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓ వైపు యుద్ధాన్ని నివారించేందుకు చర్యల ప్రయత్నాలు సాగుతుండగానే సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీలో అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు రష్యాపై మండిపడ్డాయి. తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ పేరిట రష్యా చేపట్టిన చర్యలు ‘అర్థం లేనివి’ అని అమెరికా దుయ్యబట్టింది. యుద్ధం చేయాలన్న దురుద్దేశంతోనే రష్యా కొన్ని ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించిందని మండిపడింది. 

భద్రతా మండలి సమావేశంలో ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ మాట్లాడుతూ.. ‘‘ రష్యా చర్యల వల్ల ఉక్రెయిన్‌ వ్యాప్తంగానే గాక, ఐరోపా, ప్రపంచమంతటా భయానక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉక్రెయిన్‌ సైన్యం, అక్కడి వేర్పాటువాదుల మధ్య ఘర్షణలను నివారించేలా 2014-15లో చేసుకున్న మింస్క్‌-2 ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ముక్కలు చేశారు. ఆయన అంతటితో ఆగుతారనే నమ్మకం లేదు. భద్రతా బలగాలను శాంతిపరిరక్షకులుగా పేర్కొనడం అర్థం లేని చర్య.’’ అని అన్నారు. 

ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ కు స్వతంత్ర హోదా గుర్తింపునిస్తూ రష్యా నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. అంతేగాక, తూర్పు ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు డాన్‌బాస్‌ ప్రాంతంలోకి భారీగా శాంతి పరిరక్షక బలగాలను పంపేందుకు ఆదేశాలు జారీచేసింది. దీంతో కలవరపడిన ఉక్రెయిన్‌.. ఈ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం జరగ్గా.. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ.. ‘‘తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా గుర్తింపుతో రష్యా.. అంతర్జాతీయ ప్రాదేశిక సమగ్రత, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. 

మండిపడ్డ ప్రపంచ దేశాలు..

అటు రష్యా చర్యలను బ్రిటన్‌ సహా పలు దేశాలు ఖండించాయి. పుతిన్‌ చర్యలను తప్పుబట్టిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. ఉక్రెయిన్‌కు అవసరమైన మేర తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్సలర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కూడా పుతిన్‌ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య తేల్చి చెప్పింది. 

భారత్‌ ఏమందంటే..

రష్యా - ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్రిక్తతలు తగ్గించడం తక్షణ ప్రాధాన్యత అని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి తెలిపారు. ఉద్రిక్తతల కారణంగా అక్కడి ప్రజల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని, అందుకే ఆ ప్రాంతంలో దీర్ఘకాల శాంతి, సుస్థిరత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే వరకు ఇరు పక్షాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని