Putin: పాశ్చాత్య దేశాలకు తలొగ్గేదే లేదు.. వారి ఆధిపత్యాన్ని సహించం!

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉద్ఘాటించారు.

Published : 17 Mar 2022 14:29 IST

దేశద్రోహులను హెచ్చరించిన వ్లాదిమిర్‌ పుతిన్‌

మాస్కో: ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉద్ఘాటించారు. ఈ సమయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమన్న ఆయన.. వారికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉక్రెయిన్‌కు తటస్థ స్థితిపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్‌.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందన్నారు.

గడిచిన మూడు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి టెలివిజన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలు విధిస్తోన్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయని అంగీకరించిన ఆయన.. ఇటువంటి దెబ్బలను రష్యా తట్టుకొని నిలబడగలదనే ధీమా వ్యక్తం చేశారు.

రష్యాను నాశనం చేసేందుకే..

రష్యాను ఆర్థికంగా బలహీన దేశంగా మార్చాలని పశ్చిమదేశాలు కోరుకుంటున్నాయని వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా పశ్చిమదేశాలన్నీ కలిసి తీసుకుంటున్న చర్యల వెనుక భౌగోళిక రాజకీయ లక్ష్యాలున్నాయని ఆరోపించారు. రష్యాను బలమైన, సార్వభౌమాధికార దేశంగా చూడడం వారికి ఇష్టం లేదని పుతిన్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రష్యా విచ్ఛిన్నమవుతుందని లేదా ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని వారు భావిస్తే.. రష్యా ప్రజల గురించి, మా చరిత్ర గురించి వారికి తెలియదు అంటూ పుతిన్‌ పశ్చిమ దేశాలను మరోసారి హెచ్చరించారు.

దేశద్రోహులకూ హెచ్చరిక..

దేశాన్ని నాశనం చేయడానికి రష్యాలోని కొందరు ద్రోహులను పశ్చిమ దేశాలు పావులుగా వాడుకుంటున్నాయని అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు. రష్యా కంటే పశ్చిమదేశాల వాదనకు సానుకూల గళాన్ని వినిపించే వారిని దేశద్రోహులుగా అభివర్ణించిన ఆయన.. అటువంటి వారిని రష్యన్‌ ప్రజలు తేలికగా గుర్తించగలరని అన్నారు. రష్యాను విభజించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని మరోసారి పేర్కొన్న ఆయన.. ‘ఫిఫ్త్‌ కాలమ్‌’ (రష్యాన్‌ మీడియాలో పుతిన్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఓ జర్నలిస్ట్‌ నిరసన తెలిపిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) సహాయంతో ఇక్కడి పౌరుల్లో ఘర్షణలు రేకెత్తించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా వారి ఏకైక లక్ష్యం రష్యాను నాశనం చేయడమేనని.. అయినప్పటికీ అటువంటి ప్రయత్నాలను రష్యా తిప్పికొడుతుందని వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని