Ukraine Crisis: ఉక్రెయిన్‌ యుద్ధం కీలక దశకు..!

ఉక్రెయిన్‌లో యుద్ధం కీలకదశకు చేరినట్లు అమెరికా సహా పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పోరాటం యుద్ధం

Published : 15 Jun 2022 14:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం కీలకదశకు చేరినట్లు అమెరికా సహా పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పోరాటం దీర్ఘకాలిక ఫలితాన్ని నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్థిక ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న పశ్చిమదేశాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు ఇది పురిగొల్ప వచ్చని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై పనిచేస్తున 50 దేశాల గ్రూపుతో అమెరికా డిఫెన్స్‌ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ భేటీ కానున్న నేపథ్యంలో ఈ విశ్లేషణలు వెలువడటం విశేషం. ఈ సందర్భంగా అమెరికా సరికొత్త ఆయుధ ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిపై నాటో సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం యుద్ధం ఎవరో ఒకరు నిర్ణయాత్మక ఫలితాన్ని సాధించే దశకు చేరింది. రష్యా దళాలు స్లోవియాన్స్క్‌, క్రమాటోర్క్స్‌ చేరుకోవచ్చు. లేదా ఉక్రెయిన్‌ వారిని అక్కడకు చేరుకోకుండా అడ్డుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న బలగాలతో ఒకవేళ ఉక్రెయిన్‌ అడ్డుకొంటే అది చాలా కీలకం’’ అని పేర్కొన్నారు. మూడు రకాల ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇక్కడ రెండు ప్రావిన్సుల్లో రష్యా మెల్లగా మరిన్ని భూభాగాలను కైవశం చేసుకొంటూ ముందుకు పోవచ్చు. లేకపోతే.. యుద్ధంలో మరింత ప్రతిఘటన ఎదురై ఫలితం తేలకపోతే.. దీర్ఘకాలం పోరాటం కొనసాగే అవకాశం ఉంది. ఇది భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగులుస్తుంది. లేకపోతే రష్యా తన లక్ష్యాలను మార్చుకొని.. తాను విజయం సాధించినట్లు ప్రకటించుకొని యుద్ధం ఆపేందుకు మార్గం సృష్టించవచ్చు. ఈ పరిస్థితిపై పశ్చిమదేశాల విశ్లేషకులకు పెద్దగా ఆశలు లేవు.

తూర్పున విజయం సాధించిన ప్రాంతాలను రష్యా సమీకృతం చేసుకొని భవిష్యత్తులో ఉక్రెయిన్‌ను మరింత వెనక్కి నెట్టేందుకు యత్నించవచ్చని పశ్చిమదేశాలు భయపడుతున్నాయి. మరోపక్క పశ్చిమదేశాలు ఆయుధాలు ఇవ్వకపోతే ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని ఆ దేశ అధ్యక్షుడు జలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘‘వారు మరింత ముందుకెళితే.. ఉక్రెయిన్‌ తట్టుకొని నిలబడలేదని కచ్చితంగా చెప్పగలను. మాతో కలిసి పశ్చిమ దేశాలు బలం చూపించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ దేశాలు వేగంగా ఆయుధాలను అందించాలి’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని