Joe Biden: వ్యాక్సిన్లు ఇస్తామన్నా.. కిమ్‌ పట్టించుకోవట్లేదు: జో బైడెన్‌

ఉత్తరకొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. నిత్యం లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారు. అసలే ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న కిమ్‌ రాజ్యంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందితే ప్రాణ నష్టం ఏ మేర

Published : 22 May 2022 01:48 IST

సియోల్‌: ఉత్తరకొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. నిత్యం లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారు. అసలే ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న కిమ్‌ రాజ్యంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందితే ప్రాణనష్టం ఏ మేర ఉంటుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కట్టడికి తక్షణమే వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. అయితే కరోనా టీకాలపై ముందు నుంచీ వ్యతిరేకత చూపిస్తోన్న అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్.. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగినప్పటికీ వ్యాక్సిన్ల కోసం ముందుకు రాకపోవడం గమనార్హం. ఉత్తర కొరియాకు టీకాలు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ఆఫర్‌ చేసినప్పటికీ.. కిమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదట.

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జో బైడెన్‌.. ‘‘ప్యాంగ్యాంగ్‌కు టీకా సాయం అందించేందుకు మేం ముందుకొచ్చినా అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేవలం ఉత్తరకొరియాకే కాదు.. చైనాకు కూడా తక్షణమే వ్యాక్సిన్లు పంపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ దేశాలు స్పందించట్లేదు’’ అని తెలిపారు.

ఈ నెల ఆరంభంలో ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే అక్కడ వైరస్‌ విజృంభించింది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో.. లక్షణాల ఆధారంగానే కొవిడ్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ దాదాపు 25లక్షల మంది జ్వరంతో బాధపడుతుండగా.. 66 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఉ.కొరియాలో సరైన ఆరోగ్య వ్యవస్థ లేకపోవడంతో పాటు ప్రజలెవరూ టీకాలు వేయించుకోకపోవడంతో అక్కడ వైరస్‌ పెను ప్రభావం చూపించే అవకాశముందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కిమ్‌ ఇటీవల తన పొలిట్‌బ్యూరోతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి కట్టడికి చైనా లాంటి దేశాలను చూసి నేర్చుకోవాలని సూచించారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన వైరస్‌ కట్టడికి చైనా సాయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజింగ్‌ నుంచి టెస్ట్‌ కిట్‌లు, వ్యాక్సిన్లను తీసుకునే యోచనలో కిమ్‌ ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని