Ukraine Crisis: రష్యాలో ఎవరీ ఒలిగార్క్‌లు.. వారిపై ఆంక్షలు ఎందుకు..?

రష్యాను కట్టడి చేయాలని పశ్చిమ దేశాలు భావించిన ప్రతిసారి ‘ఒలిగార్క్‌లపై ఆంక్షలు’ అనే మాట వినిపిస్తుంటుంది. అసలీ ఒలిగార్క్‌లు ఎవరు..? వారిపై ఆంక్షలు విధిస్తే రష్యాను ఏ రకంగా కట్టడి చేయవచ్చు? అనే విషయం ఆసక్తిరమైంది.

Updated : 23 Feb 2022 12:44 IST

 పశ్చిమ ఆంక్షల గురిలోకి పుతిన్‌ సన్నిహితులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రష్యాను కట్టడి చేయాలని పశ్చిమ దేశాలు భావించిన ప్రతిసారి ‘ఒలిగార్క్‌లపై ఆంక్షలు’ అనే మాట వినిపిస్తుంటుంది. అసలీ ఒలిగార్క్‌లు ఎవరు..? వారిపై ఆంక్షలు విధిస్తే రష్యాను ఏ రకంగా కట్టడి చేయవచ్చు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలను రష్యా గుర్తించడంతో బ్రిటన్‌ కొందరు ఒలిగార్క్‌లపై ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది. వారి ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ప్రయాణ ఆంక్షలనూ విధించింది.

ఒలిగార్క్‌లు ఎవరు..? 

ఒలిగార్క్‌ పదం గ్రీక్‌ నుంచి వచ్చింది. సంపన్నులు వ్యవస్థను నడిపించడాన్ని ఉద్దేశించి తొలిసారి అరిస్టాటిల్‌ ఈ పదాన్ని వాడారు. ఏదైనా ఒక రంగాన్ని పూర్తిగా గుప్పిట పెట్టుకొని విపరీతంగా డబ్బు సంపాదించిన వారిని సాధారణంగా ఒలిగార్క్‌గా పేర్కొంటారు. దేశంలో స్వల్పసంఖ్యలో ఉన్న ఒలిగార్క్‌లు కలిసి వ్యవస్థను చెప్పుచేతుల్లో పెట్టుకోవడాన్ని ఒలిగార్కీగా వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యవస్థలు అన్ని చోట్లా ఉన్నా.. రష్యా, ఉక్రెయిన్లలో మాత్రం బాగా పాపులర్‌ అయ్యాయి. సోవియట్‌ యూనియన్‌ 1990ల్లో విచ్ఛిన్నమైన తర్వాత రష్యా కమ్యూనిజం నుంచి ప్రైవేటీకరణ చేపట్టింది. బోరిస్‌ ఎల్సిన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆధీనంలో 45,000 ఫ్యాక్టరీలు, సంస్థలు ఉండేవి. వాటి ప్రైవేటీకరణ అడ్డగోలుగా జరగడంతో కొందరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. ఆ సమయంలో రష్యా నాయకత్వానికి సన్నిహితులైన కొందరు పెట్రోలియం,సహజవాయువు, లోహ గనులు వంటి వాటిపై ఏకఛత్రాధిపత్యం సాధించారు. వీరు అధ్యక్షుడికి సన్నిహితులు.

ఉక్రెయిన్‌లో కూడా ఈ వ్యవస్థ..

ఈ ఒలిగార్కి వ్యవస్థ ఉక్రెయిన్‌కు కూడా విస్తరించింది. అక్కడ ఏకంగా అధ్యక్ష పదవులు, ప్రధాని పదవులు కూడా దక్కించుకొన్నారు.  వీరిలో 2014లో అధ్యక్ష పదవి చేపట్టిన పెట్రో పొరషెంకోను ‘చాక్లెట్‌ కింగ్‌’గా పిలుస్తారు. ఈయనకు ఏకంగా చాక్లెట్‌ వ్యాపారంతోపాటు బస్సులు, కార్లు తయారు చేసే కర్మాగారాలు కూడా ఉన్నాయి. ఈయన హయాంలోనే క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఇక ‘గ్యాస్‌ క్వీన్‌’గా
పేరు తెచ్చుకొన్న యూలియా టిమోషెంకో కూడా ప్రధాని పదవిని చేపట్టారు. ఈమెకు దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ వ్యాపారం ఉంది.

సంపన్నులను గుప్పిట పెట్టుకొన్న పుతిన్‌.,.

బోరిస్‌ ఎల్సిన్‌ పదవిని వీడాక పుతిన్‌ అధికారం చేపట్టారు. ఆయన పాత ఒలిగార్క్‌లను కొంత వరకు కట్టడి చేసి తనకు అనుకూలమైన కొత్త ఒలిగార్క్‌లను సృష్టించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొందరిని అరెస్టు చేయించారు. ఫలితంగా మిగిలిన వారు పుతిన్‌కు విధేయులుగా మారిపోయారు. నమ్మకమైన వారిని ప్రభుత్వం, వ్యాపారాల్లో కీలక స్థానాల్లో ప్రతిష్ఠించారు. దీంతో చాలా వ్యాపారాలు పుతిన్‌ ఆధీనంలోకి వచ్చేశాయి.

తాజాగా బ్రిటన్‌ ఆంక్షలు విధించిన ఒలిగార్క్‌ల్లో పుతిన్‌కు అత్యంత సన్నిహితులు ముగ్గురు ఉన్నారు. వీరి పేర్లు.. గెన్నాడీ టెమ్షెంకో, బోరిస్‌ రోటెన్‌బర్గ్‌, ఐగర్‌ రోటెన్‌బర్గ్‌. వీరు రష్యా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితులు.

వోల్గా వ్యవస్థాపకుడు గెన్నాడీ టెమ్షెంకో..!

పుతిన్‌కు ఉన్న బిలియనీర్‌ సహచరుల్లో గెన్నాడీ కూడా ఒకరు.  ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 23.5 బిలియన్‌ డాలర్లు. ఆయనకు రష్యాలో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి. వీటిల్లో గ్యాస్‌ కంపెనీ నోవాటెక్‌, పెట్రోకెమికల్‌ సిబుర్‌ హోల్డింగ్స్‌ వంటివి ఉన్నాయి. ఆయనకు ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వోల్గా గ్రూప్‌ ఉంది. అతేకాదు రష్యా నేషనల్‌ హాకీ లీగ్‌కు ఛైర్మన్‌, ది  ఎస్కేఏ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ హాకీ క్లబ్‌కు అధ్యక్షుడు కూడా. 1990ల్లో సెంయిట్‌ పీటర్స్‌బర్గ్‌ చమురు వ్యాపారం చేస్తున్న సమయంలో పుతిన్‌తో పరిచయం ఏర్పడింది. పుతిన్‌ అప్పుడప్పుడే రాజకీయాల్లో  ఎదుగుతున్నారు.

స్విస్‌ కేంద్రంగా పనిచేసే గన్వోర్‌ కంపెనీని గెన్నాడీ ప్రారంభించారు. ఆయనకు రోస్సియా బ్యాంక్‌లో ప్రధాన వాటా ఉంది. తాజాగా బ్రిటన్‌ ఆంక్షలు విధించిన బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. ఈ బ్యాంక్‌ నేషనల్‌ మీడియా గ్రూప్‌లో ప్రధాన వాటాదారు. ఈ మీడియా సంస్థ ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను ఆక్రమించడాన్ని సమర్థించింది. ఉక్రెయిన్‌ను అస్థిర పర్చడంలో గెన్నాడీ హస్తం ఉందని బ్రిటన్‌ ఆరోపించింది.

పుతిన్‌ మిత్రుడి సోదరుడు బోరిస్‌ రోటెన్‌ బర్గ్‌

పుతిన్‌ చిన్ననాటి స్నేహితుడు ఆర్కెడీ రోటెన్‌బర్గ్‌కు బోరిస్‌ సోదరుడు. ఎస్‌ఎంపీ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు. బోరిస్‌ ఆస్తుల విలువ 1.2 బిలియన్‌ డాలర్లు. పుతిన్‌తో సన్నిహత సంబంధాలు ఉండటంతో ఆయనపై ఆంక్షలు విధించినట్లు బ్రిటన్‌ పేర్కొంది. 2014లో కూడా బోరిస్‌ ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. రష్యా దిగ్గజ గ్యాస్‌ సంస్థ గ్యాజ్‌ప్రోమ్‌తో కలిపి సోచి ఒలింపిక్స్‌ కోసం బోరిస్‌కు భారీ ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు.

ఇగోర్‌ రోటెన్‌ బర్గ్‌..

ఆర్కెడీ రొటెన్‌బర్గ్‌ కుమారుడు ఇగోర్‌. ఆర్కెడీ చిన్నప్పుడు పుతిన్‌కు జూడో స్పారింగ్‌ భాగస్వామి. ఇగోర్‌ ఆస్తుల విలువ 1.1 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. 48 ఏళ్ల ఇగోర్‌ రష్యా గ్యాస్‌ దిగ్గజం గాజ్‌ప్రోమ్‌కు సంబంధించిన డ్రిల్లింగ్‌ కంపెనీని నియంత్రిస్తున్నారు. 2014లో అమెరికా ఇగోర్‌ ఆస్తులను స్తంభింపజేసింది. రష్యా ప్రభుత్వానికి వ్యూహాత్మక సంబంధాలు ఉన్న నేషనల్‌ టెలిమెట్రిక్‌ సిస్టమ్స్‌ డైరెక్టర్లలో ఒకరు. ఆర్టీ-ఇన్వెస్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌సిస్టమ్‌లో వాటాదారు కూడా. ఇది రష్యా ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యమున్న సంస్థ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని